జాతరలో విషాదం..జెయింట్ వీల్ నుండి పడి.. వృద్ధురాలు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..
నోయిడాలోని ఒక ఫెయిర్ గ్రౌండ్‌లో అమర్చిన ఫెర్రిస్ వీల్ (జెయింట్ వీల్) నుండి పడి 55 ఏళ్ల మహిళ చనిపోయింది. ఆమె కోడలు, మనవడు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. జాతర నిర్వాహకుడు, వీల్ ఆపరేటర్‌తో సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

నోయిడాలోని సదర్‌పూర్‌లో జాతరలో ఘోర ప్రమాదం జరిగింది. జెయింట్ వీల్ నుండి పడి ఓ వృద్ధురాలు చనిపోయిందని, మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, వారిని పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయమై సమాచారం ఇస్తూ.. బాధితుల ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
అందిన సమాచారం ప్రకారం.. జన్మాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలోని సదర్‌పూర్ సోమ్ బజార్‌లో జాతర నిర్వహిస్తారు. జాతరను చూసేందుకు వందలాది మంది వస్తుంటారు. గురువారం సాయంత్రం కూడా జాతరలో సందడి నెలకొంది. కానీ ఒక ప్రమాదం జాతర వైభవాన్ని మొత్తం పాడుచేసింది. వాస్తవానికి.. అర్థరాత్రి ఇద్దరు మహిళలు, ఒక యువకుడు జాతరలో జెయింట్ వీల్ నుండి పడిపోయారు.
జెయింట్ వీల్ నుంచి పడి ఉష అనే వృద్ధురాలు మృతి చెందింది. కాగా షాలు అనే మహిళ, యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే.. సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తదుపరి చర్యలకు ఉపక్రమించారు.
గాయపడిన మహిళ షాలు మాట్లాడుతూ.. “నేను, మా అత్తగారు జెయింట్ వీల్ ఎక్కడ కోసం జాతరకు వెళ్ళాము. మమ్మల్ని జెయింట్ వీల్ లో కూర్చోబెట్టేసమయంలో అందులోని ఊయల బోల్టులు వదులుగా ఉన్నాయి. ఈ విషయాన్ని నిర్వహకుడికి చెప్పాం.. కానీ, అతను అంగీకరించలేదు. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఊపు ఎక్కగానే బ్యాలెన్స్ తప్పి పడిపోయాం.
మృతురాలి కుమారుడు రవి మాట్లాడుతూ..“మా అమ్మ, నా తమ్ముడి భార్య సోమ్ బజార్‌లోని జాతర వెళ్లారు. అక్కడ జెయింట్ వీల్ పై నుంచి కిందపడటంతో అమ్మ మెడ ఎముక విరిగి అక్కడికక్కడే మృతి చెందింది. నా తమ్ముడి భార్య మాత్రం సీరియస్‌గా ఉంది." అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఏడీసీపీ శక్తి అవస్తీ మాట్లాడుతూ.. “జాతరలో జెయింట్ వీల్ తిరుగుతుండగా ఇద్దరు మహిళలు, ఒక యువకుడు పడిపోయారు. పడిపోవడంతో ఉష అనే 55 ఏళ్ల మహిళ మృతి చెందగా, మిగిలిన వారు గాయపడి చికిత్స పొందుతున్నారు. తహరీర్ ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాం. అని తెలిపారు.