ఎన్నో అరాచకాలకు పాల్పడి, ఎంతోమంది అమాయకులను పొట్టనబెట్టుకున్న కరడు గట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూకే హతమవ్వడంతో యూపీ పోలీసులతో పాటు అతని స్వగ్రామంలోని ప్రజలు సైతం సంబరాలు చేసుకున్నారు.

అయితే తన భర్త ఎంతో మంచివాడని అంటున్నారు దూబే భార్య రిచా దుబే. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని కోరుతూ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో రిచా తన భర్త వ్యక్తిత్వం, ఆయనతో అనుబంధం తదితర పాత విషయాలను గుర్తు చేసుకున్నారు.

Also Read:22ఏళ్ల క్రితం కూడా వికాస్ దూబే సేమ్ ప్లాన్.. కానీ..

తన సోదరుడు రాజు నిగమ్‌కు దుబే స్నేహితుడని.. 1990లో తొలిసారి ఆయనను కలిశానని ఆమె చెప్పారు. మా అన్నయ్యే ఇద్దరికి పెళ్లి చేశారని.. బిక్రులో వికాస్ మాటే ఫైనల్ అన్నట్లుగా ఉండేదని రిచా తెలిపారు. ఆయన కరడుగట్టిన నేరస్థుడు అయినప్పటికీ భార్యాపిల్లలను ఎంతగానో ప్రేమించేవారని, ముఖ్యంగా పిల్లలంటే వికాస్‌కు ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు.

తనకు ప్రతినెల ఖర్చుల కోసం రూ.40 వేలు పంపించేవారని, తమ పెద్ద కుమారుడు శంతన్ రష్యాలో మెడిసిన్ చదువుతున్నాడని, చిన్న కుమారుడు ఆకాశ్ 12వ తరగతిలో 90 శాతం మార్కులు సాధించాడని రిచా దుబే అన్నారు.

స్థానికంగా ఉండే రాజకీయాలు, సమస్యలు పిల్లలపై ప్రభావం చూపించకూడదనే ఉద్దేశంతో 2004లో లక్నోలో ఇళ్లు కట్టించారని ఆమె చెప్పారు. వాళ్లిద్దరూ బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని వికాస్ ఆశించారని, అలాగే ఆయన తల్లిదండ్రులను కూడా బాగా చూసుకునేవారని రిచా వెల్లడించారు.

Also Read:విస్తుపోయే వికాస్ దూబే ఆదాయం: ఎలా ఖర్చు చేసేవాడో.....

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సందర్భంగా బిక్రూలో పోలీసులకు డిన్నర్ ఏర్పాటు చేశారని.. ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో తెలియదన్నారు. కానీ జూలై 3 వేకువజామున 2 గంటల సమయంలో తనకు ఫోన్ చేసి లక్నోలోని ఇంటికి పారిపోమ్మని చెప్పాడని రిచా గుర్తుచేసుకున్నారు.

తాను ఆలస్యం చేయకుండా స్నేహితుల సాయంతో తప్పించుకున్నానని, ఆ రోజే వికాస్‌తో చివరిసారిగా మాట్లాడటమని రిచా కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఆయనను ఉపయోగించుకున్నారని.. ఆ తర్వాత నాశనం చేశారని ఆమె ఆరోపించారు. తన భర్త నేరస్తుడే కావొచ్చని.. కానీ ఆయనో మంచి భర్త, తండ్రి అంటూ రిచా దుబే ఉద్వేగానికి గురయ్యారు.