ముంబై: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. డోనాల్డ్ ట్రంప్ పర్యటన వల్ల భారత్ సూపర్ పవరేం కాదని ఆయన వ్యాఖ్యానించారు. క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ తో పాటు మానవ వనరులు కూడా భారత్ కు అవసరమని ఆయన అన్నారు. 

కొద్ది రోజుల్లో ట్రంప్ భారత్ కు వస్తున్నారని అంటూ ట్రంప్ పర్యటన వల్ల ఇండియా సూపర్ పవర్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ తో పాటు మనకు మానవ వనరులు కూడా మనకు అవసరమని ఆయన అన్నారు. 

ఓ పుస్తకావిష్కరణ సభలో ఉద్ధవ్ థాకరే ఆ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెసు సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్, సినీ ప్రముఖుడు జావెద్ అక్తర్ పాల్గొన్నారు. పేరెత్తకుండా ప్రధాని మోడీపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: బాహుబలి నేనే అంటూ...: వీడియోను షేర్ చేసిన డోనాల్డ్ ట్రంప్

మన్ కీ బాత్ కు హృదయం నుంచి వెలువడిన దిల్ కీ బాత్ కు చాలా తేడా ఉందని ఆయన అన్నారు. ఈ నెల 24వ తేదీన ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో థాకరే ఆ వ్యాఖ్యలు చేశారు. 

డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24వ తేదీన భారత పర్యటనకు వస్తున్నారు. ఆయన వెంట సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఉంటారు. ఆయన ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటిస్తారు. ఆయన నేరుగా అహ్మదాబాద్ వచ్చి మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు.