న్యూఢిల్లీ: భారత పర్యటనకు బయలుదేరడానికి కొద్ది గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాహుబలి 2 సినిమాను ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేశారు. బాహుబలిలోని ప్రభాస్ ఫోటోను మార్ఫ్ చేసి తన ముఖం పెట్టిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

గుర్తు తెలియని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆ వీడియోకు భారత దేశంలోని తన గొప్ప మిత్రులను కలుసుకోవడానికి చూస్తున్నానని అంటూ శీర్షిక పెట్టి ట్రంప్ దాన్ని షేర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో జయో రే బాహుబాలి పాట వినిపిస్తూ ఉంటుంది. 

ఆ వీడియోలో ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా కనిపిస్తుంది. బాహుబలిలోని రమకృష్ణ పాత్ర శివగామి ముఖాన్ని ఆమె ముఖంతో మార్ఫింగ్ చేసి పోస్టు చేశారు. నరేంద్ర మోడీ ముఖాన్ని కూడా మార్ఫ్ చేసి పెట్టిన క్లిప్ కొద్ది సెకన్లు కనిపిస్తుంది.

 

ఆ వీడియోలో ట్రంప్ కత్తి యుద్ధం చేస్తూ కనిపిస్తాడు. రథంపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు. గుర్రాలపై స్వారీ చేస్తూ యుద్ధం చేస్తూ కనిపిస్తాడు. అమెరికా, ఇండియా యునైటెడ్ అనే సందేశంతో వీడియో ముగుస్తుంది. 

డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం భారత్ చేరుకుంటారు. ఆయన నేరుగా అహ్మదాబాద్ వస్తారు. విమానాశ్రయం నుంచి రోడ్ షో చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్దదైన మొతేరా స్టేడియం చేరుకుంటారు. ఆగ్రాలోని తాజ్ మహల్ ను కూడా ఆయన సందర్శిస్తారు.