అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు ఉదయం  అహ్మదాబాద్ కు చేరుకొన్నారు.  ప్రత్యేక విమానంలో ట్రంప్ దంపతులు అహ్మదాబాద్‌కు చేరుకొన్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీతో పాటు  గుజరాత్ సీఎం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

 

ట్రంప్ దంపతులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు పలువురు మంత్రులు  ట్రంప్ కు స్వాగతం పలికారు. విమానం దిగి కిందకు రాగానే భారత ప్రధాని మోడీ ట్రంప్ ను  ఆత్మీయంగా ఆలింగనం చేసుకొన్నారు. ట్రంప్ సతీమణి మెలానియాతో మోడీ కరచాలనం చేశారు. ఆ తర్వాత అక్కడే ఉన్న అమెరికా, ఇండియాకు చెందిన అధికారులను మోడీ ట్రంప్ కు పరిచయం చేశారు.

 

గుజరాతీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారంగా కళాకారులు ట్రంప్ దంపతులకు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ట్రంప్ కూతురు ఇవాంకా ఆమె భర్త  కూడ ట్రంప్ కంటే ముందే అహ్మదాబాద్ కు చేరుకొన్నారు. 

ప్రత్యేక విమానంలో ట్రంప్ దంపతులు సోమవారం నాడు షెడ్యూల్ టైమ్‌కు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొంది. ఎయిర్‌పోర్ట్‌ నుండి సబర్మతి ఆశ్రమానికి ట్రంప్  దంపతులు చేరుకొంటారు. సబర్మతి ఆశ్రమంలో  గాంధీ సమాధికి నివాళులర్పించనున్నారు. 

Also read:అహ్మదాబాద్‌కు చేరుకొన్న మోడీ: మిమ్మల్ని కలుస్తానని ట్రంప్ ట్వీట్

గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత ట్రంప్ దంపతులు మొతెరా స్టేడియంలో  నిర్వహించే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే స్టేడియం మొత్తం  భారీగా జనంతో నిండిపోయింది.