యూపీఏ పేరు మారిపోతుందా? బెంగళూరు భేటీలో విపక్ష కూటమికి కొత్త పేరు
2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న సంగతి తెలిసిందే. యూపీఏకు కాంగ్రెస్ సారథ్యం వహించింది. చైర్ పర్సన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. అయితే, తాజాగా, విపక్షాలు బెంగళూరులో భేటీ కాబోతున్నారు. ఆప్, టీఎంసీలు చేరుతున్న ఈ కూటమికి కొత్త పేరును పెట్టబోతున్నట్టు తెలుస్తున్నది.

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాకమునుపు పదేళ్లు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలయెన్స్ కూటమిగా దానికి పేరుంది. కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్టు పార్టీలు సహా దాని భావసారూప్య పార్టీలు ఈ కూటమిలో ఉండేవి. యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ వ్యవహరించారు. అయితే, 2014లో ఈ కూటమి దారుణ పరాజయానికి గురైంది. వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మళ్లీ దాని భావసారూప్య పార్టీలతో చేతులు కలిపే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్త కూటమి పేరును మార్చబోతున్నారని తెలుస్తున్నది.
విపక్షాల కూటమికి కొత్త పేరును ఇవాళ, రేపు బెంగళూరులో జరుగుతున్న సమావేశాల్లో ప్రతిపాదించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ధ్రువీకరించింది. తాము అన్ని నిర్ణయాలు తీసుకుంటామని, కానీ, వాటిని కాంగ్రెస్ ఏకపక్షంగా తీసుకోబోదని, అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.
బెంగళూరు భేటీల్లో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌ను ప్రతిపాదించనున్నారు. అలాగే, రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ముసాయిదా కోసం, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలు కమ్యూనికేట్ చేసుకోవడానికి, క్యాంపెయిన్ ప్రణాళికలు, వ్యూహాలు రచించుకోవడానికి తగిన ఏర్పాట్ల గురించీ ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తున్నది.
బెంగళూరు భేటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగంతో ప్రారంభం కానున్నట్టు సమాచారం. రెండు రోజులు ఈ భేటీలు జరుగుతాయి. భేటీల తర్వాత సాయంత్రం 4 గంటలకు వారు ప్రెస్ మీట్లు పెట్టనున్నారు.