ఉత్తరప్రదేశ్‌లో రఘువీర్ సింగ్ ఇంటిలో ఇద్దరు కోడళ్లు ఉన్నారు. చిన్న కోడలు భర్త కానిస్టేబుల్. పెద్ద కొడుకు మరణించాడు. కోడళ్లు తరచూ గొడవ చేసుకుంటూ ఉండటంతో ఇంట్లో అశాంతి నెలకొంది. సోమవారం రాత్రి కూడా ఇలాగే గొడవ జరగ్గా రఘువీర్ సింగ్ చిన్న కోడలిపై గొడ్డలితో దాడి చేయడంతో ఆమె మరణించింది. 

ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణం జరిగింది. కానిస్టేబుల్ తండ్రి.. ఇంట్లోని కోడలిపై దాడికి దిగాడు. కొడుకు లేని ఆ సమయంలో ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఆమెను చంపిన తర్వాత నిందితుడు రక్తపు చేతులతోనే కిరావళి పోలీసు స్టేషన్‌లో మంగళవారం లొంగిపోయాడు.

మాలిక్‌పూర్ గ్రామ నివాసి రఘువీర్ సింగ్‌ ఇద్దరి కొడుకులకు పెళ్లైంది. పెద్ద కొడుకు మరణించాడు. దీంతో ఆయన భార్య కూడా వీరి ఇంటిలోనే ఉంటున్నది. చిన్న కొడుకు గౌరవ్ సింగ్ ఫరుక్కాబాద్‌లో పోలీసు కానిస్టేబుల్‌గా ఉన్నాడు. ఆయన భార్య 28 ఏళ్ల ప్రియాంక సింగ్.

అయితే, ఈ ఇద్దరు తోడుకోడళ్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. వీరి ఘర్షణలతో కుటుంబమంతా అశాంతిగా ఉంటున్నది. సోమవారం రాత్రి కూడా వీరిద్దరూ తీవ్రంగా వాగ్వాదం చేసుకున్నారు. వారిని అడ్డుకోవడానికి రఘువీర్ సింగ్ జోక్యం చేసుకున్నాడు. కానీ, వారిద్దరూ ఆయనను ఖాతరు చేయలేదు. ప్రియాంక సింగ్ ఆయనను వెనక్కి నెట్టడంతో రఘువీర్ సింగ్ కిందపడిపోయాడు. దీంతో ఆగ్రహంలో రఘువీర్ సింగ్ గొడ్డలి తీసుకుని ఆమె తలపై వేటు వేశాడని డీసీపీ సోనమ్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు ప్రియాంక సింగ్ భర్త.. గౌరవ్ సింగ్ ఇంటిలో లేడు. 

Also Read: నేనైతే అలా భయపడేవాడిని కాదు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

ఈ ఘటన గురించి తెలియగానే ప్రియాంక సింగ్ కుటుంబం పోలీసు స్టేషన్‌కు వెళ్లి రఘువీర్ సింగ్, ప్రియాంక సింగ్ భర్త గౌరవ్ సింగ్ సహా ఐదుగురు కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. ప్రియాంక సింగ్‌ను చంపేసిన రఘువీర్ సింగ్ నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి కుటుంబ కలహాల్లో తీవ్ర ఆగ్రహంతో తాను తన కోడలిని చంపేశానని ఒప్పేసుకున్నాడు.