కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో బెంగళూరు నగరంలో స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు రావడంతో అప్పటి సీఎం సిద్ధరామయ్య, నగర అభివృద్ధి శాఖ మంత్రి జార్జి వెనుకడుగు వేశారని, తానైతే ముందుకే వెళ్లేవాడినని అన్నారు. 

బెంగళూరు: విభేదాలు పక్కనపెట్టి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని సాధించి పెట్టడంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు సక్సెస్ అయ్యారు. సీఎం సీటు కోసం వీరిద్దరూ ఎంత ప్రయత్నించారో మనం చూశాం. ఎట్టకేలకు సిద్ధరామయ్య సీఎంగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికీ వారి మధ్య సఖ్యత కొనసాగుతున్నది. ఈ సందర్భంలోనే డీకే శివకుమార్.. సిద్ధరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐదేళ్ల క్రితం హెబ్బల్ స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి స్థానికుల నిరసనలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భయపడిపోయారని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అదే తానైతే నిరసనకారుల తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదని తెలిపారు. 

బెంగళూరు జిల్లా వ్యవస్థాపకుడైనా నాదప్రభు కెంపెగౌడ 514 జయంత్యుత్సవాలు కర్ణాటకలో మంగళవారం జరిగాయి. కెంపెగౌడకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నివాళులు అర్పించారు. బెంగళూరు అభివృద్ధికి కెంపెగౌడ దార్శనికత కారణమని, ఆయన గొప్ప పరిపాలకుడని సిద్ధరామయ్య కొనియాడారు. 

Also Read: Ponguleti: బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు.. టార్గెట్ ఆ మంత్రేనా?

కెంపెగౌడకు నివాళులు అర్పించిన తర్వాత డీకే శివకుమార్ మాట్లాడుతూ.. 2017లో అప్పటి సీఎం సిద్ధరామయ్య, అప్పటి బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి జార్జి నగరంలో స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు రావడంతో వెనుకంజ వేశారని అన్నారు. ఒక వేళ తానే ఆ స్థానంలో ఉంటే నిరసనకారులకు లొంగేవాడిని కాదని, పర్యవసానాలు ఏమైనా ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవాడినని తెలిపారు. భవిష్యత్‌లో మేలు చేసే పనులకు సంబంధించి తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటానని వివరించారు.