ఉత్తరప్రదేశ్‌లో ఏడేళ్ల కిందటి వరకట్నం కేసులో కీలక మలుపులు వచ్చాయి. ఏకంగా భార్యనే హత్య చేసి మిన్నకున్నాడు. పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం బయటపడటంతో పోలీసులు దర్యాప్తు చేశారు. కోర్టు ఆ వ్యక్తి జీవిత ఖైదు విధించింది. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి అదనపు వరకట్నం కోసం భార్యను తరుచూ కొట్టేవాడు. ఓ సారి ఇలాంటి దాడిలోనే తలకు బలమైన గాయాలు తగిలి భార్య మరణించింది. ఈ విషయాన్ని ఆమె తల్లికి ఆలస్యంగా చెప్పాడు. పాము కుట్టి మరణించినట్టు అబద్ధాలు చెప్పాడు. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో పాము కాటుకు సంబంధించిన అంశాలేవీ లేవని, తలకు బలమైన గాయాల వల్లే మరణించినట్టు తేలింది. అనంతరం, సంబంధిత సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భర్తకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు అధికారులు శనివారం తెలిపారు.

బహ్రెచ్ జిల్లా రాణిపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో రత్తాపూర్ గ్రామంలో సెహజాద్ అలీ అనే వ్యక్తి తజీనాను 2011లో పెళ్లి చేసుకున్నాడు. తజీనా శ్రీవస్తి జిల్లా భింగా పోలీసు స్టేషన్ పరిధిలోని విష్ణుపూర్ గ్రామానికి చెందిన రబియా కూతురు. 

తజీనా తల్లి రబియా విధవ. అయినప్పటికీ ఆమె తాహతుకు మించి వరకట్నం ఇచ్చి తన కూతురిని మెట్టినింటికి పంపింది. కానీ, తజీనాను భర్త తరుచూ కొడుతుండేవాడు. అదనపు కట్నం కోసం వేధించేవాడు. 2015 నవంబర్‌లో 24 ఏళ్ల తన కూతురు రజీనాను సెహజాద్ తీవ్రంగా కొట్టి చంపేశాడని తెలుసుకుంది.

విషయాన్ని ఆరా తీయగా తజీనా పాము కాటుతో మరణించినట్టు సెహజాద్ చెప్పాడు. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో ఇందుకు విరుద్ధమైన వాస్తవాలు బయటపడ్డాయి. ఆ తర్వాత పోలీసులు సెహజాద్‌ను అరెస్టు చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టారు.

Also Read: కానిస్టేబుల్ తో ఎస్సై ప్రేమవివాహం.. ఆ తరువాత వేధింపులు...

దర్యాప్తులో సెహజాద్ నేరానికి పాల్పడ్డట్ట స్పష్టం అయింది. దీంతో జిల్లా సెషన్ జడ్జీ ఉత్కర్ష్ చతుర్వేది సెహజాద్‌కు జీవితకాల కారాగార శిక్ష విధించారు. అలాగే, రూ. 56 వేల జరిమానా వేశారు.

ఒక వేళ జరిమానా చెల్లించకుంటే అదనంగా రెండు సంవత్సరాలపై రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాలని జడ్జీ ఆదేశించారు. దోషి కట్టే జరిమానాలో సగం మొత్తం మరణించిన తజీనా తల్లి రబియాకు వెళ్లుతుందని న్యాయమూర్తి తెలిపారు.