ప్రమాదవశాత్తు ఓ యువకుడు రైలు లో నుంచి జారీ పడ్డాడు. తీవ్రగాయాలపాలై... పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చినా... తనను తాను కాపాడుకోవడానికి ఆ యువకుడు సాహసం చేశాడు. దాదాపు 9కిలోమీటర్లు... ఆ పరిస్థితుల్లో నడిచి.. తన ప్రాణాలు తానే రక్షించుకున్నాడు. ఈ సంఘటన  హసన్ పర్తి సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యూపీకి చెందిన కొందరు యువకులు జీవనోపాధి నిమిత్తం ఏపీకి వలస వస్తున్నారు. ఆ వలస కార్మికుల్లో సునీల్ చౌహాన్(24) కూడా ఒకరు. కాగా.. వీరు సంఘమిత్రా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా... రైలు హసన్ పర్తి చేరుకుంది. ఆ సమయంలోల సునీల్ టాయ్ లెట్ కి వెళ్లి... రైలు తలుపు వద్ద నిల్చొని ఉన్నాడు. ఆ క్రమంలో ఒక్కసారి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు.

అతను ఆ షాక్ నుంచి తేరుకునే సరికి రైలు స్టేషన్ దాటి పోయింది. అతను పడిపోవడం ఎవరూ గమనించకపోవడం గమనార్హం. తీవ్రగాయాలపాలైన సునీల్ కి కడుపులో నుంచి పేగులు బయటకు కూడా వచ్చాయి. తాను కిందపడిన ప్రాంతంలో ఒక్క మనిషి కూడా లేకపోవడంతో... తాను బతకడం కష్టమని భావించాడు. అందుకే సాహసం చేసి తన ప్రాణాలు కాపాడుకునేందుకు నిశ్చయించుకున్నాడు.

పేగులు కడుపులో నుంచి బయటకు పడుతున్నా... రక్తం తీవ్రంగా బయటకు  కారుతున్నా పట్టించుకోకుండా దాదాపు 9కిలోమీటర్ల దూరం నడిచాడు. సమీప రైల్వే స్టేషన్ చేరుకోబోతోండగా.. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితంగా క్లిష్టంగా ఉన్నప్పటికీ కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.