Uttar Pradesh : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి పండగపూట గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ రైతులకు సరికొత్త కానుకను పంపించారు.  

Uttar Pradesh : దీపావళి పండగవేళ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మానవత్వం చాటుకున్నారు. మంగళవారం తన అధికారిక నివాసం వద్ద పంజాబ్‌లోని వరద బాధిత రైతులకు సహాయంగా 1000 క్వింటాళ్ల గోధుమ విత్తనాలతో కూడిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. “బాధలో ఉన్నవారికి మనం అండగా నిలిచినప్పుడే పండుగ అసలైన ఆనందం ఉంటుంది” అని యోగి అన్నారు.

రైతు ఒంటరివారు కాదు : యోగి 

పంజాబ్ రైతులు ఈ కష్టకాలంలో ఒంటరి కాదని ముఖ్యమంత్రి యోగి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రతి బాధితుడికి అండగా నిలుస్తుందని అన్నారు. సహాయ సామాగ్రి, ఆర్థిక సహాయం, పునరావాసం లాంటి ప్రతి స్థాయిలోనూ రైతులను ఆదుకుంటామని సీఎం యోగి భరోసా ఇచ్చారు.

ఈ ఏడాది పంజాబ్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జనజీవనం ప్రభావితం అవ్వడమే కాకుండా, రైతుల విత్తన నిల్వలు కూడా నాశనమయ్యాయని సీఎం యోగి తెలిపారు. దీనివల్ల తర్వాతి పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంజాబ్‌కు కు వేలాది బస్తాల (1000 క్వింటాళ్లు) గోధుమ విత్తనాలను పంపడం జరుగుతోందని… ఇది రైతులకు ఒక కొత్త ఆశను ఇస్తుందన్నారు యోగి. .

 “బీబీ-327”: రోగ నిరోధక, పోషకాలున్న గోధుమ విత్తనాలతో కొత్త బలం

పంజాబ్ కోసం పంపిన విత్తనం ‘బీబీ-327’ రకానికి చెందినవని… ఇది రోగ నిరోధక, పోషకాలున్న విత్తనాలని అన్నారు. కేవలం 155 రోజుల్లో ఉత్పత్తయ్యే బయో-ఫోర్టిఫైడ్ గోధుమ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ రకం హెక్టారుకు 80 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇవ్వగలదన్నారు. ఈ విత్తనం రైతులకు సహాయపడటమే కాకుండా, ఉత్తరప్రదేశ్ విత్తన, అభివృద్ధి సంస్థ పురోగతికి, విశ్వసనీయతకు చిహ్నమని యోగి అన్నారు.

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ స్వావలంభన

దేశంలోని మొత్తం వ్యవసాయ యోగ్య భూమిలో ఉత్తరప్రదేశ్ వాటా కేవలం 11 శాతమే అయినా దేశ మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం 21 శాతం వాటా అందిస్తోందని యోగి తెలిపారు. ఇది యూపీ రైతుల కష్టానికి ఫలితం మాత్రమే కాదు, ప్రభుత్వ విధానపరమైన సామర్థ్యం, సాంకేతికతకు కూడా నిదర్శనమని అన్నారు.