రాంగ్ ఇంజెక్షన్ ఇవ్వడంతో బాలిక మృతి.. డెడ్ బాడీని వదిలిపెట్టి హాస్పిటల్ స్టాఫ్ పరార్
ఉత్తరప్రదేశ్‌లోని 17 ఏళ్ల బాలికకు ఓ హాస్పిటల్‌లో తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో జ్వరం తగ్గిపోయిన ఆ బాలికకు ఈ రాంగ్ ఇంజెక్షన్ కారణంగా ఆరోగ్యం వేగంగా దిగజారింది. ఆమె మరణించింది. స్టాఫ్ డెడ్ బాడీని వదిలి హాస్పిటల్ వదిలి పారిపోయింది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జ్వరంతో హాస్పిటల్‌లో చేరిన 17 ఏళ్ల బాలికకు రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె మరణించింది. డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు కనిపించకుండా బయట పార్క్ చేసిన బండిపై పెట్టి హాస్పిటల్ స్టాఫ్ అంతా పరారైంది. డాక్టర్ కూడా పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉన్నదని, కానీ, ఆపరేటర్ డాక్టర్ కాదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్సీ గుప్తా వెల్లడించారు.
మెయిన్‌పురి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం జ్వరం రావడంతో 17 ఏళ్ల భారతిని గిరోర్ ఏరియాలో కర్హల్ రోడ్‌లోని రాధా స్వామి హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. బుధవారం ఆమె దాదాపు కోలుకుందని భారతి బంధువు మనీషా తెలిపింది. అప్పుడు డాక్టర్ మరో ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ బాలిక ఆరోగ్యం వేగంగా క్షీణించింది.
ఆమె కండీషన్ దిగజారిపోతున్నదని, వెంటనే ఆమెను వేరే హాస్పిటల్ తీసుకెళ్లాలని స్టాఫ్ వారికి సూచించింది. కానీ, అప్పటికే భారతి మరణించిందని మనీషా వివరించింది. డెడ్ బాడీని పార్కింగ్‌లోని ఓ బండిపై ఉంచి వారంతా పారిపోయారని తెలిపింది.
ఈ విషయంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ యాక్షన్ తీసుకున్నారు. నోడల్ అధికారిని పంపించి హాస్పిటల్ ను సీల్ చేయించారు. అక్కడ డాక్టర్ గానీ, వేరే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గానీ లేరు. ఆ హాస్పిటల్‌లో ఒక సర్జరీ పేషెంట్ ఉన్నాడని, ఆయనను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించామని ఆర్సీ గుప్తా వివరించారు. హాస్పిటల్ రిజిస్టర్ చేయించుకున్నారని, కానీ, అందులోని ఆపరేటర్ అసలు డాక్టరే కాదని వెల్లడించారు. కాబట్టి, లైసెన్స్‌ను కూడా రద్దు చేసినట్టు చెప్పారు.