Uttar Pradesh election result 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీ ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాబ‌ట్ట‌రాలేక‌పోయింది. కాంగ్రెస్, బీఎస్పీలు మ‌రింత దారుణ ఫ‌లితాలను చ‌విచూశాయి. ఎంఐఎం అస‌లు ఖాతానే తెర‌వ‌లేక పోయింంది.  

Uttar Pradesh election result 2022: దేశంలో రాజ‌కీయంగా అత్యం కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ హవా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాటిన బీజేపీ.. ప్ర‌స్తుత ట్రెండ్ గ‌మనిస్తే.. 263 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొన‌సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన సీట్ల కంటే అధిక సంఖ్య‌లో అధిక్యంలో సమాజ్ వాదీ పార్టీ కొన‌సాగ‌తున్న‌ప్ప‌టికీ.. ఆ పార్టీ అంచ‌నాల‌కు అంద‌నంత దూరంలో నిలిచిపోయింది. దీంతో బీజేపీ రాష్ట్రంలో తిరుగులేని విధంగా మ‌ళ్లీ అధికారం ఏర్పాటు చేసే సంకేతాలు పంపింది. 

అయితే, కాంగ్రెస్, బీఎస్పీలు మ‌రింత దారుణ ఫ‌లితాలను చ‌విచూశాయి. ఎంఐఎం అస‌లు ఖాతానే తెర‌వ‌లేక పోయింంది. యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించిన హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న‌ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) యూపీ ఎన్నిక‌ల్లో ఖాతా తెరవలేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ముస్లింలు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), దళితుల మద్దతు ఉన్న పార్టీలతో కూడిన భగీదారీ పరివర్తన్ మోర్చా అనే కొత్త ఫ్రంట్‌ను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు.

భగీదారీ పరివర్తన్ మోర్చా ఎన్నికల్లో గెలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు – ఒక దళితుడు, ఓబీసీ నాయకుడు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, వారిలో ఒకరు ముస్లిం అని కూడా ఒవైసీ ప్ర‌క‌టించారు. బాబూ సింగ్ కుష్వాహా నేతృత్వంలోని జన్ అధికారి పార్టీ, వామన్ మెష్రామ్ నేతృత్వంలోని భారత్ ముక్తి మోర్చా, అనిల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జనతా క్రాంతి పార్టీ, రామ్ ప్రసాద్ కశ్యప్ నేతృత్వంలోని భారతీయ వంచిత్ సమాజ్ పార్టీ ఈ ఫ్రంట్‌లో భాగమయ్యాయి.

యూపీలో ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఒవైసీ ఎత్తిచూపేందుకు ప్రయత్నించారు. ఇటీవ‌ల కాక‌రేపిన హిజాబ్ వ్య‌వ‌హారాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. హిజాబ్ వివాదంపై వ్యాఖ్యానిస్తూ, “బీజేపీ ప్రభుత్వం తమ బిడ్డ‌ల‌ను హిజాబ్ ధరించి చదువుకోవడానికి అనుమతించడం లేదు, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడం గురించి మాట్లాడుతున్నారు. ఇదేనా అతని 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారం అంటూ విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం జైల్లో ఉన్న‌.. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజం ఖాన్ గురించి కూడా ఆయన మాట్లాడారు.

ఇదిలావుండ‌గా, యూపీలో బీజేపీ హ‌వా కొన‌సాగుతోంది. ఇప్పిటివ‌ర‌కు కొన‌సాగిన ఎన్నిక‌ల కౌంటింగ్ ట్రెండ్ ను గ‌మ‌నిస్తే.. 263 స్థానాల్లో బీజేపీ అధిక్యంలో కొన‌సాగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ 131 స్థానాల్లో ముంద‌జ‌లో ఉంది. ఇక కాంగ్రెస్‌, బీఎస్పీలు దారుణ ఫ‌లితాలు చ‌విచూశాయి. మాజీ సీఎం మాయావ‌తి నేతృత్వంలోని బీఎస్పీ కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క స్థానంలోనే మందంజ‌లో ఉండ‌గా.. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో అధిక్యంలో కొన‌సాగుతోంది. కాగా, 1985 నుంచి యూపీలో ఏ సీఎం మళ్లీ వ‌రుస‌గా ఎన్నిక కాలేదు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ట్రెండ్‌ను బ్రేక్ చేశారు.