Asianet News TeluguAsianet News Telugu

UP Election 2022: యూపీ సీఎంగా మళ్లీ యోగి ఆదిత్యనాథ్‌.. కాంగ్రెస్‌కు ఘోర పరాభవమే, సర్వేలో ఆసక్తికర విషయాలు

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌పై అందరి దృష్టి నెలకొంది. మరోసారి అధికారాన్ని అందుకోవాలని బీజేపీ, ఎలాగైనా పవర్‌ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇండియా - న్యూస్ జాన్ కీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది.

UP Election 2022 Latest poll claims Yogi Adityanath will win, another rout for Priyanka led Congress
Author
Lucknow, First Published Dec 24, 2021, 5:37 PM IST

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌పై అందరి దృష్టి నెలకొంది. మరోసారి అధికారాన్ని అందుకోవాలని బీజేపీ, ఎలాగైనా పవర్‌ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే సర్వేలను బట్టి చూస్తే.. వచ్చే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 మధ్య ఇండియా - న్యూస్ జాన్ కీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ఇది తేలింది. 

20 వేల మంది పాల్గొన్న ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో 233 నుంచి 252 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని సర్వే అంచనా వేసింది. సమాజ్‌వాదీ పార్టీ 135 నుంచి 149 సీట్లు సొంతం చేసుకుని రెండోస్థానంలో నిలవనుంది. ఇక బీఎస్పీ విషయానికి వస్తే  ఆ పార్టీ 11 నుంచి 12 సీట్లు సొంతం చేసుకోవచ్చని, కాంగ్రెస్ పార్టీ మరోసారి సింగిల్ డిజిట్‌కే పరితమై 3 నుంచి 6 సీట్ల మధ్య గెలుచుకోవచ్చని పేర్కొంది. 

ఇక జన్‌కీ బాత్ ఒపీనియర్ పోల్‌లో బీజేపీకి 39 శాతం ఓట్లు, సమాజ్‌వాదీ పార్టీకి 35 శాతం, బహుజన్ సమాజ్ పార్టీకి 14 శాతం, కాంగ్రెస్‌కు 5 శాతం, ఇతర పార్టీలకు 7 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల 52 శాతం మంది సంతోషంగా వున్నారని.. 48 శాతం మంది అసంతృప్తిగా వున్నట్లు తేలింది. యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవికి మంచి ఎంపిక అని మరో 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్ధిగా కేవలం 2 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. ఇకపోతే 75 శాతం మంది ఓటర్లు ప్రధాని నరేంద్ర మోడీ పథకాలు బాగున్నాయని చెప్పారు.

ఒపీనియన్ పోల్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో 24 శాతం మంది ప్రజలు కులం, మతం ప్రాతిపదికన ఓటేస్తామని చెబితే.. 23 శాతం మంది ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఆధారంగా ఓటు వేస్తామని చెప్పారు. 21 శాతం మంది శాంతిభద్రతలు అత్యంత కీలకమైన అంశంగా పేర్కొన్నారు. 16 శాతం మంది ప్రభుత్వ పథకాలు తమకు ఎంత మేర ప్రయోజనం చేకూర్చాయి అనే విషయాన్ని పరిగనణలోనికి తీసుకోగా.. 10 శాతం మంది ద్రవ్యోల్బణం తమ ఓటుపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అయితే ఆశ్చర్యకరంగా రామమందిరం వివాదం ఈసారి ఓటింగ్‌ను ప్రభావితం చేస్తుందని ఒక శాతం మంది అభిప్రాయపడ్డారు. 

బీజేపీకి పోలయ్యే 39 శాతం ఓట్లలో యాదవేతర వర్గాలు (19.46 శాతం) , బ్రాహ్మణులు (5.6 శాతం) ఓట్లు లభిస్తాయని సర్వే తెలిపింది. ఇక సమాజ్‌వాదీ పార్టీకి ముస్లింలు (16.1 శాతం) , యాదవ కమ్యూనిటీ (8.1 శాతం) నుంచి ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios