ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ మున్సిపల్ సీటు మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో ప్రస్తుత రాంపూర్ మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికలో తానే స్వయంగా పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ, మహిళకే రిజర్వ్ చేయడంతో ఆ 45 ఏళ్ల నేత.. 45 గంటల్లో పిల్లను వెతుక్కుని నామినేషన్‌కు ముందే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. 

లక్నో: ఆయనకు 45 ఏళ్లు. ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాడు. పెళ్లి చేసుకోవద్దని శపథం వేసుకున్నాడు. కానీ, ఒక్క ఎన్నికల నోటిఫికేషన్ ఆయన శపథాన్ని వెనక్కి తీసుకునేలా చేసింది. ఆ బ్రహ్మచారిని సంసారి చేసింది. రామపూర్ మున్సిపల్ సీట్‌ను మహిళకే రిజర్వ్ చేయడంతో ఆయన ఆ మహిళ కోసం వెతకడం ప్రారంభించాడు. 45 గంటల్లోనే పిల్లను వెతుక్కుని పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ సీటుకు నామినేషన్ వేయడానికి ముందే పెళ్లి చేసుకుని భార్యతో నామినేషన్ వేయించబోతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా మామున్ షా ఖాన్ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ నేతకు పెళ్లిపై ఆసక్తి లేదు. స్వయంగా ఆయనే రాంపూర్ మున్సిపల్ సీటు ఎన్నికలో పోటీ చేయాలని ఆరాటపడ్డాడు. కానీ, ఆ సీటును మహిళకు రిజర్వ్ చేసినట్టు ప్రకటన రావడంతో ఆలోచనలో పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. 45 గంటల వ్యవధిలోనే పెళ్లి కూతురును వెతుక్కున్నాడు. పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. 

మున్సిపల్ సీటుకు నామినేషన్ తుది గడువు ఏప్రిల్ 17. మామున్ షా ఖాన్ ఏప్రిల్ 15వ తేదీనే పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు.

Also Read: హంగ్ అసెంబ్లీ దిశగా కర్ణాటక.. అతిపెద్ద పార్టీగా బీజేపీ.. ఏషియానెట్-జన్‌ కీ బాత్ సర్వే వివరాలు ఇవే..

ప్రస్తుతం తన పెళ్లి వేడుకల ఏర్పాట్లు, మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లూ రెండూ జరుగుతున్నాయని మామున్ షా ఖాన్ ఆజ్ తక్‌తో మాట్లాడుతూ తెలిపాడు. ఈ ఎన్నికలో తాను పోటీ చేయాలని ప్రజలు భావించారని, అందుకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వివరించాడు.

గ్రామ పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో సీటు మహిళలకు రిజర్వ్ అయినప్పటికీ.. వారి భర్తలే ఎక్కువ అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు. అధికారికంగా పేరు మహిళకు ఉన్నా.. వ్యవహారమంతా భర్త చేతి మీది నుంచే నడుస్తూ ఉంటుంది. పై ఘటన కూడా ఇదే సాంప్రదాయాన్ని వెల్లడిస్తుంది.