కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అయితే కన్నడనాట ప్రజల చూపు ఎటువైపు ఉందనేది.. ఏషియానెట్-సువర్ణ న్యూస్- జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ రౌండ్-1 అంచనా వేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని ఏషియానెట్-సువర్ణ న్యూస్- జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ రౌండ్-1 అంచనా వేసింది. అయితే కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా(సింగిల్ లార్జెస్ట్ పార్టీగా) అవతరించే అవకాశం ఉంది. బీజేపీకి 98 నుంచి 109 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 89-97 సీట్లు వస్తాయని, జేడీఎస్‌కు 25-29 సీట్లు రావచ్చని, ఇతరులకు 0-1 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
అయితే కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సాధారణ మెజారిటీ 113గా ఉంది. అయితే ఏ పార్టీ కూడా ఈ మెజారిటీ మార్క్‌ను అందుకోలేదని ఏషియానెట్-సువర్ణ న్యూస్ నిర్వహించిన జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ రౌండ్-1 అంచనా వేసింది.
ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ముక్కోణపు పోరు ఉంటుందని సర్వే అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లు సర్వే వెల్లడించింది. అయితే రాష్ట్రంలో అధికార బీజేపీ పట్ల వ్యతిరేకత కనిపించింది. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ కొన్ని స్థానాలను కోల్పోతుందని.. కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో అధికంగా పొందుతుందని సర్వేలో అంచనా వేసింది.

ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. ఓల్డ్ మైసూర్‌లో ముక్కోణపు పోరు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య హోరాహోరీ కనిపిస్తుంది. బెంగళూరు, సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరీ సాగుతుందని సర్వే అంచనా వేసింది. హైదరాబాద్ కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం, ముంబై కర్ణాటక రీజియన్‌లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుందని సర్వే వెల్లడించింది. ఇక, కోస్టల్ కర్ణాటక రీజియన్‌లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపిస్తుందని సర్వే అంచనా వేసింది.
అయితే అధికార వ్యతిరేక ప్యాక్టర్ ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అధికారంలో వచ్చేందుకు సరిపడే మెజారిటీని సాధించలేకపోవచ్చని సర్వే వెల్లడించింది. ఎందుకంటే.. అధికార ప్రభుత్వాన్ని గద్దె దింపేదుకు, కాంగ్రెస్‌కు సులువుగా విజయాన్ని అందించే స్థాయిలో బలమైన ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడమే కారణమని సర్వే అంచనా వేసింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీజేపీ కంటే కాంగ్రెస్‌కే కొద్దిగా ఓట్ల శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు దాదాపు 38-40 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేయగా.. బీజేపీకి 37-39 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు అత్యంత హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నాయని తెలిపింది. అయితే కాంగ్రెస్‌కు బీజేపీ కంటే స్వల్పంగా ఓట్ల శాతం ఎక్కువగా వస్తుందని అంచనా వేసినప్పటికీ.. గెలిచే స్థానాల పరంగా హస్తం పార్టీ గణనీయమైన ఆధిక్యతగా మారకపోవచ్చని సర్వే తెలిపింది. ఇక, జేడీఎస్‌కు 16 నుంచి 18 శాతం ఓట్లు రావచ్చని, ఇతరులకు 5-7 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.
సర్వే ప్రకారం.. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత డీకే శివకుమార్‌కు(కాంగ్రెస్ కీలక నేత, సీఎం రేసులో నిలిచే వ్యక్తి) మంచి మొత్తంలో వొక్కలిగ ఓట్లు వస్తాయని.. ఈ ఓట్లు జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌కు మారవచ్చని, ఇది గత ఎన్నికలతో పోలిస్తే జేడీఎస్ 12 స్థానాలను కోల్పోయేలా చేస్తుందని అంచనా వేయబడింది.
సర్వే వెల్లడించిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ముస్లిం, హిందూ ఓట్లలో బలమైన పోలరైజేషన్ కనిపిస్తోంది. దళిత లెఫ్ట్, దళిత రైట్ ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న చోటల్లా దళితుల ఓట్లు హిందూ ఓట్లలా పోలరైజ్ అయి బీజేపీ వైపు వెళ్లడం సర్వేలో కనిపిస్తోంది.
ఔట్‌కమ్ మోడల్ సంభావ్యత మ్యాప్‌తో కర్ణాటక అంతటా 20,000 యాదృచ్ఛిక నమూనాలతో ఈ అభిప్రాయ సేకరణ మార్చి 15 నుంచి ఏప్రిల్ 11 మధ్య నిర్వహించబడింది. ఈ సర్వే చేసినప్పుడు చాలా మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత రౌండ్-2 అభిప్రాయ సేకరణ జరుగనుంది.
జన్ కీ బాత్ విషయానికి వస్తే.. ఇంతకుముందు 36 సర్వేలను నిర్వహించింది. అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలలో కచ్చితమైన లేదా దాదాపు కచ్చితమైన ఫలితాలు, పోకడలను అంచనా వేసింది. ఇక, 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జన్ కీ బాత్ ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేసింది.
