Asianet News TeluguAsianet News Telugu

యోగికి బాబా షాక్.. నెక్ట్స్ షాక్ ఎవరిదో..?

యోగికి బాబా షాక్.. నెక్ట్స్ షాక్ ఎవరిదో..?

UP CM Yogi another Failure

అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. సీనియర్లను పక్కకునెట్టి మరీ సీఎంగా పగ్గాలు చేపట్టారు యోగి ఆదిత్యనాధ్. మొదట్లో మనోడి స్పీడు చూసి యూపీకి మంచి రోజులు వచ్చాయని.. అందరూ సంతోషించారు. అటు పార్టీ శ్రేణులు కూడా నరేంద్రమోడీ వారసుడు అన్నంతగా ఆకాశానికెత్తేశారు. కానీ అది గతం.. లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి తోడు ఎన్నో ఏళ్లుగా కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్ నియోజకవర్గాన్ని కోల్పోవడం కమలనాథులను విస్మయానికి గురిచేసింది. దీంతో యోగికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. అప్పటిదాకా కీర్తించిన వారే వెనుక నుంచి విమర్శించడం ప్రారంభించారు. అది ఏ స్థాయికి చేరిందంటే.. ముఖ్యమంత్రిగా మౌర్యను నియమించాలనే డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇలాంటి టైంలో పెద్ద షాకిచ్చింది పతంజలి సంస్థ.

ఉత్తరప్రదేశ్‌లో రూ.6వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన మెగా ఫుడ్ ప్రాజెక్ట్‌‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు పతంజలి తెలిపింది. ఆ నిర్ణయంతో యోగి ఇబ్బందుల్లో పడ్డారు. వెంటనే పతంజలి సహ వ్యవస్థాపకులైన బాబా రాందేవ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.. ఫుడ్ పార్క్‌ను యూపీలోనే ఏర్పాటు చేయాలని... ఎలాంటి సమస్యలైనా త్వరలోనే పరిష్కరిస్తామని.. తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినట్లుగా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని యమూనా ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో 425 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్క్ పెట్టేందుకు పతంజలి సంస్థ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాజెక్ట్ రిపోర్టును సైతం పంపింది. దీనికి సీఎం యోగి ఆమోదముద్ర వేయడం కూడా జరిగిపోయింది.

అయితే ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులను పతంజలి ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ అనుమతుల కోసం తాము మంత్రులను, అధికారులను, ముఖ్యమంత్రిని ఎన్ని సార్లు కలిసినప్పటికీ.. వారు తమను పట్టించుకోలేదని.. అందువల్ల ఫుడ్ పార్క్‌ను మరోచోటికి తరలించాలని నిర్ణయించినట్లు పతంజలి ఎండీ బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన నిర్ణయంతో ఆఘమేఘాల మీద కదిలిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రాజెక్ట్‌ను తరలించరాదంటూ పతంజలిని కోరినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఫుడ్ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో లక్షల మంది స్థానిక రైతులకు లబ్ధి కలుగుతుంది.. యువతకు ఉపాధి దొరుకుతుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ రాష్ట్రం నుంచి తరలిపోతే తన ప్రతిష్టకు మచ్చ వస్తుందని యోగి భయపడ్డారని అందుకే పతంజలితో రాయబారాలు మొదలెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆదిత్యనాథ్ విజ్ఞప్తిని బాబా రాందేవ్ మన్నిస్తారా..? లేదా అన్నది కొద్దిరోజుల్లో తెలనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios