Asianet News TeluguAsianet News Telugu

up assembly election 2022 : 94వ సారి యూపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న హ‌స‌నురామ్ అంబేద్క‌రీ..

యూపీ ఎన్నికల్లో ఓ పెద్దాయన 94వ సారి పోటీ చేయాలని భావించి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే 100 సార్లు ఓడిపోవాలన్న రికార్డ్ కోసం ఆయన ఈ సారి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నారు. 

Up Assembly elections 2022: Hasanuram Ambedkar to contest UP elections for the 94th time.
Author
Lucknow, First Published Jan 20, 2022, 4:57 PM IST

యూపీ (up) అసెంబ్లీ ఎన్నిక‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడు, ఎవ‌రు ఏ పార్టీలో ఉంటార‌నే విష‌యంలో అంతుబ‌ట్ట‌డం లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీలో ఉండి మంత్రులుగా ప‌ని చేసిన నాయ‌కులే.. ప్ర‌తిప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీ (samajwadi party) లో చేరారు. స‌మాజ్ వాదీ పార్టీకి చెందిన ములాయం సింగ్ యాద‌వ్ కోడలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే నిన్నటి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న ప్రియాంక మౌర్య నేడో, రేపో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. 

ఇలా యూపీ రాజ‌కీయాలు వేడి పుట్టిస్తున్న ఈ త‌రుణంలో ఓ సాధార‌ణ వ్య‌క్తి కూడా ఈ భారీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఓ సాధార‌ణ వ్య‌క్తి గురించి మ‌నం ఎందుకు మాట్లాడుకోవాల్సి వ‌స్తుందంటే ఆయ‌న‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 74 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 94 సార్లు వివిధ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు.100 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన రికార్డు సృష్టించాల‌ని భావిస్తున్నారు. ఈ సారి ఎన్నిక‌ల్లో ఆగ్రాలోని ఖేరాఘర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన హసనురామ్ అంబేద్కరీ ఓ సాధార‌ణ వ్య‌వ‌సాయ కూలి. అత‌డు స్కూల్ కు వెళ్లి ఎప్పుడూ చ‌దువుకోలేదు కానీ హిందీ,  ఊర్దూ, ఇంగ్గీష్‌ చ‌ద‌వ‌గ‌ల‌రు. రాయ‌గ‌ల‌రు. అంబేద్కరీ కాన్షీరామ్ స్థాపించిన ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF)లో సభ్యుడు. ఆయ‌న 1985 నుంచి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయితీ ఎన్నికలతో పాటు వివిధ ఎన్నికల్లో, వివిధ స్థానాల నుంచి పోటీ చేశారు. ఆయ‌న 1988లో భారత రాష్ట్రపతి పదవికి తన నామినేషన్ పత్రాలను కూడా స‌మ‌ర్పించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర్య‌యింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ స్థానాల నుంచి పోటీ చేశారు. 2021లో జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ సిద్ధాంతాల ప్రకారమే అన్ని ఎన్నికల్లో తాను అన్ని ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాన‌ని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా హసనురామ్ అంబేద్కరీ నామినేషన్ దాఖలు చేసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను ఓడిపోతాన‌ని తెలిసినా పోటీ చేస్తున్నాన‌ని అంబేద్క‌రీ అన్నారు. గెలిచే రాజకీయ నాయకులు జనాలను మర్చిపోతారని.. న‌మ్మిన ఓట‌ర్ల‌కు ఓ ఆప్ష‌న్ ఇచ్చేందుకు తాను పోటీ చేస్తున్నాన‌ని తెలిపారు. త‌న ప్ర‌త్య‌ర్థులు ఎవ‌ర‌నే విష‌యం ప‌ట్టించుకోన‌ని చెప్పారు. ఎన్నికల్లో 100 సార్లు ఓడిపోయి రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అవినీతి రహిత అభివృద్ధి, సమాజంలో అట్టడుగువర్గాల సంక్షేమమే త‌న ఎజెండా అని చెప్పారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీఎస్పీ మూలాల‌ను బలోపేతం చేయడానికి ప‌ని చేశాన‌ని అన్నారు. అయితే 1985లో పార్టీ నుంచి టిక్కెట్ అడిగినప్పుడు, ‘నీ భార్య కూడా నీకు ఓటు వేయదని’ తనను ఎగతాళి చేశార‌ని చెప్పారు. దీంతో తాను తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాన‌ని అప్ప‌టి నుంచి ప్రతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు. 

ప్ర‌స్తుతం స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేసిన హ‌స‌నురామ్ అంబేద్క‌రీ ఆయ‌న భార్య‌, ఇత‌ర మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఇంటింటి ప్ర‌చారం ప్రారంభించారు. అయితే ఇత‌ను 1989 ఫిరోజాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన స‌మ‌యంలో అత్య‌ధికంగా అంటే అంటే 36,000 ఓట్లను సాధించాడు. ఇది అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios