చెన్నై: సినీ రచయితగా, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘ద్రవిడ ఉద్యమం’లో కీలక భూమిక పోషించిన ముత్తువేల్ దక్షిణమూర్తి అలియాస్ కరుణానిధి తన 14వ వసంతంలో రాజకీయారంగ్రేటం చేశారు.

జస్టిస్ పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన ఆళగిరిస్వామి ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన కరుణానిధి ‘హిందీ’ వ్యతిరేక ఉద్యమంలో, ఆందోళనల్లో పాల్గొన్నారు. స్థానిక యువతలో స్ఫూర్తిని రగిల్చేందుకు సంస్థను స్థాపించిన కరుణానిధి.. ఆ సంస్థ సిబ్బంది కోసం చేతిరాతతో రూపొందించిన దినపత్రిక ‘మానవర్ నెసాన్’ నడిపారు. 

తదుపరి దశలో ‘తమిళ్ మానవర్ మాండ్రం’ అనే పేరుతో విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. తదనంతర కాలంలో ఉధ్రుతంగా సాగిన ద్రవిడ ఉద్యమానికి ప్రేరణగా, ప్రతీకగా ‘తమిళ్ మానవర్ మాండ్రం’ పేరొందింది.

తమిళ్ మానవర్ మాండ్రం సభ్యుల్లో స్ఫూర్తిని రగిలించడానికి, ఆవేశం పెంపొందించడానికి ప్రారంభించిన దినపత్రిక క్రమంగా ‘మురసొలి’గా.. ప్రస్తుతం తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట కజగం (డీఎంకే) అధికార దినపత్రికగా అవతరించింది. హిందీ వ్యతిరేక ఉద్యమంలోనూ, సంఘ సంస్కరణోద్యమంలో కీలక పాత్ర పోషించిన కరుణానిధి తానూ భాగస్వామి కావడంతోపాటు విద్యార్థి నాయకుడిగా స్ఫూర్తినిచ్చారు.