పంజాబ్ రైతుల్ని దెబ్బతీసిన అకాల వర్షాలు.. ప్రభుత్వ సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు
పంజాబ్‌లో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా పంటలు ధ్వంసమయ్యాయి . దీనికి తోడు రైస్ మిల్లర్ల సమ్మె, కమీషన్ ఏజెంట్ల కారణంగా రైతుల కష్టాలు మరింత పెరిగాయి.
దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆలస్యంగా ప్రారంభమైన నైరుతి ఆ తర్వాత మొహం చాటేశాయి. ఎల్ నినో కారణంగా వర్షపాతం తగ్గిందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో వర్షాకాలం ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లుగా మారింది. పంటలు ఎండిపోయి, భూములు నెర్రెలిచ్చి రైతుల పరిస్ధితి దీనంగా మారింది. ఇదిలావుండగా పంజాబ్‌లో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా పంటలు ధ్వంసమయ్యాయి. ధాన్యం మార్కెట్‌లను వరదలు ముంచెత్తడంతో పంట మొత్తం కొట్టుకుపోయింది.
పంజాబ్‌లోని 10 జిల్లాలకు వాతావరణ శాఖ వర్షసూచన ఇవ్వడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాటియాలాకు చెందిన దర్శన్ సింగ్ అనే రైతు మీడియాతో మాట్లాడుతూ.. అస్ధిర వాతావరణం వల్ల దాదాపు 30 శాతం పంటలు దెబ్బతిన్నాయన్నారు. దీనికి తోడు రైస్ మిల్లర్ల సమ్మె, కమీషన్ ఏజెంట్ల కారణంగా రైతుల కష్టాలు మరింత పెరిగాయి. సమ్మె విరమించాల్సి వున్నా పంటలు పండే విషయంలో రైతులు సందిగ్ధంలో వున్నారు.
ఆకస్మాత్తుగా కురిసిన వర్షాలకు తేమ తగ్గి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని దర్శన్ సింగ్ అన్నారు. తాము గత ఏడు రోజులుగా క్రాప్ లిఫ్టింగ్ కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కానీ కమీషన్ ఏజెంట్లు మాత్రం క్రాప్ లిఫ్టింగ్ చేయడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నష్టపరిహారం కోసం రైతులు ఎదురుచూస్తున్నారని దర్శన్ సింగ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోలేదని, పంట నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నాలుగుసార్లు పొలాలను సర్వే చేసినా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వలేదని, ఈసారి ఏకంగా సర్వే కూడా చేయలేదని దర్శన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంజాబ్‌లోని ఫేతేగఢ్ సాహిబ్ జిల్లాలోని నారైన్‌గర్ గ్రామానికి చెందిన మరో రైతు రంజోత్ సింగ్.. తాను 100 క్వింటాళ్లకు పైగా వరి పంటను నష్టపోయానని ఆయన వెల్లడించారు. సోమవారం నాటికి పంజాబ్‌లోని పలు ధాన్యం మార్కెట్‌లకు 37,222 మెట్రిక్ టన్నులకు పైగా వరి వచ్చింది. వాటిలో 27,342 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబడ్డాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి కేవలం 2,993 మెట్రిక్ టన్నుల వరిని మాత్రమే లిఫ్ట్ చేసినట్లుగా అధికారులు తెలిపారు.