హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. కర్ణాటక హైకోర్టు తీర్పు పట్ల అసంతృప్తిగా ఉన్న స్టూడెంట్లు మంగళవారం నిర్వహించిన పీయూ పరీక్షలకు హాజరు కాలేదు. మొత్తంగా 40 మంది బాలికలు పరీక్షలు రాయలేదని లెక్కలు చెబుతున్నాయి.
కర్నాటకలో ఇంకా హిజాబ్ వివాదం ముగిసిపోయినట్టు కనిపించడం లేదు. ఈ విషయంలో హైకోర్టు కోర్టు తీర్పు వెలువడి దాదాపు 15 రోజులు కావస్తున్నా.. దీనిపై ఇంకా నిరసనలు ఆగడం లేదు. తాజాగా ఉడిపి జిల్లాకు చెందిన 40 మంది ముస్లిం విద్యార్థిణులు మంగళవారం నాడు మొదటి ప్రీ-యూనివర్శిటీ పరీక్షకు హాజరుకాలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే వీరు పరీక్షకు హాజరుకాలేదని స్పష్టంగా తెలుస్తోంది.
తరగతి గదిలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లను కర్నాటక హైకోర్టు మార్చి 15వ తేదీన కొట్టివేసింది, ఇస్లామిక్ విశ్వాసంలో, మతపరమైన ఆచారంలో హిజాబ్ ముఖ్యమైన భాగం కాదనీ తెలిపింది. విద్యాసంస్థల్లో ప్రతీ ఒక్కరూ యూనిఫామ్ నిబంధనలు అనుసరించాలని సూచించింది.
ఈ తీర్పు వెలువడిన నాడే రాష్ట్రంలోని యాద్గిర్‌లోని సురపుర తాలూకా కెంబావి ప్రభుత్వ పీయూ కళాశాల విద్యార్థులు పరీక్షను బహిష్కరించి వెళ్లిపోయారు. విద్యార్థులకు మెయిన్ పరీక్షలకు ముందు సన్నాహక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా హిజాబ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అసంతృప్తితో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. కాగా మంగళవారం నాటి పరీక్షలకు దూరంగా ఉన్న వారిలో కుందాపూర్‌కు చెందిన 24 మంది, బైందూరుకు చెందిన 14 మంది, ఉడిపి ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థిణులు ఉన్నారు. వీరిలో కొందరు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. వీరు గతంలో ప్రాక్టికల్ పరీక్షలను కూడా బహిష్కరించారు.
ఆర్‌ఎన్ శెట్టి పీయూ కళాశాలలో 28 మంది ముస్లిం బాలికలు ఉండగా.. 13 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కొందరు విద్యార్థులు హిజాబ్‌లు ధరించి పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ వారికి అనుమతి నిరాకరించారు. అలాగే ఉడిపిలోని భండార్కర్ కళాశాలలో ఐదుగురు బాలికల్లో నలుగురు విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, బస్రూర్ శారద కళాశాలలో బాలికలందరూ పరీక్షలకు హాజరయ్యారు.
నవుండ ప్రభుత్వ పీయూ కళాశాలలో ఎనిమిది మంది బాలికల్లో ఆరుగురు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కాగా, 10 మంది ముస్లిం బాలికలకు గాను ఇద్దరు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థిణులు హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణను మార్చి 24న సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ అంశంపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు వేచి చూడాలని ముస్లిం స్టూడెంట్లు యోచిస్తున్నారు.
ఈ ఏడాది మొదట్లో ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థిణులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడాన్ని అక్కడి మేనేజ్ మెంట్ నిరాకరించింది. దీంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి తర్వాత కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. ఈ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కర్ణాటక పేరు అంతర్జాతీయంగా మారుమోగుపోయింది. ఇది పెద్ద రాజకీయ దుమారాన్నే రేకెత్తించింది. అనేక మంది రాజకీయ నాయకులు ఈ వివాదంపై కామెంట్స్ చేశారు. దీనిపై స్టూడెంట్లు హైకోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం మార్చి 15వ తేదీన తీర్పు వెలువరించింది. అయితే ఇది తీర్పు పట్ల ముస్లిం బాలికలు అసంతృప్తిగా ఉన్నారు.
