దేశంలోని ప్రతిపక్ష పార్టీల అణచివేత, మాట వినని నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్న ప్రధాని నరేంద్రమోడీపై పోరాటానికి ఇప్పటికే విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. కోల్‌కతాలో మమతా బెనర్జీ దీక్షతో తామంతా ఒక్కటేనని చాటి చెప్పిన ప్రతిపక్ష పార్టీలు తాజాగా ప్రధానిపై మరో అస్త్రాన్ని సిద్ధం చేశాయి.

రక్షణ అవసరాల నిమిత్తం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో విపక్షాలు ప్రధాని మోడీపై విరుచుకుపడుతున్నాయి. అనిల్ అంబానీకి మేలు కలిగించేందుకే ప్రధాని రాఫెల్ ఒప్పందాన్ని చేసుకున్నారంటూ ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాఫెల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించడానికి కేంద్రప్రభుత్వం నిరాకరించడం దానికి తోడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ప్రకటించకపోవడం వంటి కారణాలతో విపక్షాలు గుర్రుగా ఉన్నాయి.

ఈ క్రమంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్‌సభ ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని ఆయా పార్టీల అధినేతలు భావిస్తున్నారు. లోక్‌సభకు చివరి రోజు అయినా...మోడీ సర్కార్‌ తీరుపై ఆఖరి పోరాటంగా, ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైనే ఉన్నాయనడానికి సంకేతంగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు.

ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో చంద్రబాబు చర్చలు జరిపారు. 

ఎన్టీఆర్ ఫార్ములా:

1989లో దేశాన్ని ఒక కుదుపు కుదిపిన బోఫోర్స్ కుంభకోణంలో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సైతం నిరాకరించారు. దీంతో ఎన్టీఆర్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ఊహించని విధంగా నిరసనకు దిగింది. ఫ్రంట్‌లోని 12 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 106 మంది ఎంపీలు రాజీనామా చేశారు. దీంతో లోక్‌సభ సంక్షోభంలో పడింది.