భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత స్థానం.. యూఎన్ చీఫ్ కీలక ప్రకటన
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉండాలన్న భారత్ ఆకాంక్షలను తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని, అయితే సభ్యదేశాలు అగ్రశ్రేణి సంస్థను సంస్కరించడంపై నిర్ణయం తీసుకోవాలని ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.
భారతదేశాన్ని విశ్వ దేశమని, బహుపాక్షిక వ్యవస్థలో భారత్ చాలా ముఖ్యమైనభాగస్వామని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ అభివర్ణించారు. అయితే దాని UN భద్రతా మండలి సభ్యత్వంపై నిర్ణయం తీసుకునేది సభ్యులేననీ, తాను కాదని అన్నారు.
G20 సమ్మిట్‌కు ముందు న్యూ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడారు. ఈ సందర్భంగా యుఎన్‌ఎస్‌సిలో భారతదేశం సభ్యత్వం పొందే సమయం ఆసన్నమైందా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. "యుఎన్‌ఎస్‌సిలో ఎవరు ఉండాలనేది నేను నిర్ణయించలేను. ఆ పని అందులోని సభ్యుల చేయాలి. భారతదేశం నేడు అత్యధిక జనాభా కలిగిన దేశమే కాకుండా.. ప్రపంచ బహుపాక్షిక వ్యవస్థలో భారత్ చాలా ముఖ్యమైన భాగస్వామి అని స్పష్టమైంది. నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా బహుపాక్షిక వ్యవస్థలో సంస్కరణలు అవసరమని నేను నమ్ముతున్నాను" అని గుటెర్రెస్ అన్నారు.
బహుపాక్షిక సంస్థలకు సంస్కరణల కోసం టైమ్‌లైన్ ఉందా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. సంస్కరణలు చేయవలసిన అవసరం ఉంది, కానీ మనకు అది లభిస్తుందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఇది అత్యవసరమని నేను భావిస్తున్నాను" అని అన్నారు.
ఛిన్నాభిన్నమైన ప్రపంచంలో పెరుగుతున్న విభజనలు, విశ్వాసాన్ని దెబ్బతీసే విపత్తుకు వ్యతిరేకంగా హెచ్చరించినందున ప్రపంచానికి అత్యవసరంగా అవసరమయ్యే పరివర్తనాత్మక మార్పులను సాధించడంలో భారతదేశం యొక్క G20 అధ్యక్ష పదవి సహాయపడుతుందని గుటెర్రెస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహౌపనిషత్ స్ఫూర్తితో భారతదేశం జి20 థీమ్‌గా స్వీకరించిన 'వన్ ఎర్త్, వన్ ఫామిలీ, వన్ ఫ్యూచర్' అనే నినాదాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు.