ఈ కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటుపరం చేస్తున్నదని కొన్ని సంవత్సరాలుగా విమర్శకులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ సీజన్‌లో ఈ చర్చ మరింత పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇదే ప్రశ్నను ఓ మీడియా సంస్థ ఏకంగా రైల్వే శాఖ మంత్రి ముందే ఉంచింది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాము రైల్వేను ప్రవైటుపరం చేసే చాన్సే లేదని అన్నారు. 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో రైల్వే బడ్జెట్(Railway Budget) ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్‌లో కలిపేశారు. ఆ తర్వాత రైల్వే శాఖకు న్యాయమైన కేటాయింపులు జరపడం లేదని, ప్రైవేటు భాగస్వామ్యానికి తెరలేపి క్రమంగా.. ప్రైవేటు పరం(Privatisation) చేయనుందనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బడ్జెట్ సందర్భంలో ఈ చర్చకు ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రశ్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Minister Ashwini vaishnaw) ముందుకు వచ్చింది.

రైల్వే, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కొందరు విలేకరులు రైల్వేను ప్రైవేటుపరం చేస్తున్నారనే చర్చపై స్పందించాల్సిందిగా కోరారు. రైల్వేలో ప్రభుత్వం మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించాల్సి ఉన్నదని ఆయన తెలిపారు. అంతేకానీ, రైల్వేను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైల్వే ప్రయాణికుల అనుభూతిని మార్చాలనే ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఉన్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మూడు అంశాలపై ఫోకస్ పెట్టిందని తెలిపారు. స్టేషన్‌లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం, కొత్త తరం ట్రైన్లు, ప్రయాణికుల భద్రత.. ఈ మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నదని వివరించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ రైల్వే సేవలపై కీలక ప్రకటనలు చేశారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం 400 కొత్త వందే భారత్ ట్రైన్ల(Vande Bharat Trains)ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ట్రైన్లు తక్కువ ఇంధనంతో నడిచేవిగా రూపొందిస్తామని తెలిపారు. కనీసం 2000 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను ‘కవచ్’ కిందకు తెస్తామని వివరించారు. సేఫ్టీ కెపాసిటీ అనుకూలమైన ప్రపంచ శ్రేణి టెక్నాలజీనే ఈ కవచ్. అదే విధంగా వచ్చే మూడేళ్లలో 100 కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీటిని మల్టీ మోడల్ లాజిస్టిక్ ఫెసిలిటీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అలాగే, రైతుల ప్రయోజనాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపయోగంగా ఉండేలా ‘వన్ స్టేషన్- వన్ ప్రొడక్ట్’ విధానాన్ని అవలంభిస్తామని వివరించారు. తద్వార ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఉత్పత్తులను ఆ రైల్వేలపై సులువుగా తరలించడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇలా కొత్త ఉత్పత్తులను రైల్వే శాఖ ముందుకు తెస్తుందని పేర్కొన్నారు. వీటితోపాటు రైల్వే ద్వారా పోస్టల్ పార్సిల్‌ సేవలనూ అందిస్తామని చెప్పారు. తద్వారా కొత్త బిజినెస్ ఏరియాలకు ఈ సేవలు గణనీయంగా ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అంటే.. త్వరలో పోస్టల్ సేవల కోసం రైల్వేలనూ ఉపయోగించనున్నట్టు తెలుస్తున్నది. పీఎం గతి శక్తి కింద ఈ భారీ ప్రణాళిక ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.

ఈ 400 వందే భారత్ రైళ్లు ఎనర్జీ ఎఫీషియెంట్‌గా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ట్రైన్లను స్టీల్‌తో తయారు చేశారు. కానీ, ఈ వందే భారత్ రైళ్లను లైట్ వెయిట్ అల్యూమినియంతో తయారు చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. తద్వారా రైల్వే కోచ్‌లను భారత్ సంప్రదాయంగా ఉపయోగిస్తున్న స్టీల్‌ను పక్కన పెట్టి అల్యూమినియం లోహాన్ని వినియోగించనుంది. అయితే, ఈ అల్యూమినియం ద్వారా కోచ్‌లను తయారు చేయడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని తెలుస్తున్నది.