Asianet News TeluguAsianet News Telugu

ఆ రోజుల్లో స్మృతి ఇరానీ.. ‘‘ రోజ్ ఈజ్ ఏ రోజ్ ’’ అంటూ సెలబ్రెటీల కాంప్లిమెంట్

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తాను మోడలింగ్ చేస్తున్నప్పటి రోజుల ఫోటోను పంచుకున్నారు. క్షణాల్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..  సెలబ్రెటీలు ఆమె అందాన్ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. ‘‘ రోజ్ ఈజ్ ఏ రోజ్’’ అంటూ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ వ్యాఖ్యానించారు

union minister Smriti Irani Shares Throwback Pic From Her Modelling Days. Celebs React ksp
Author
First Published Feb 6, 2024, 2:49 PM IST

స్మృతీ ఇరానీ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కేంద్రమంత్రిగా, బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. నరేంద్ర మోడీ రెండు కేబినెట్‌లలోనూ స్మృతీ స్థానం దక్కించుకున్నారు. పరిపాలనా వ్యవహారాలతో పాటు బీజేపీ నేతగానూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యర్ధులను వాడి వేడి విమర్శలతో ముప్పుతిప్పలు పెట్టగలరు. ఇప్పుడంటే రాజకీయ నేతగానే స్మృతీ అందరికీ తెలుసు.. కానీ పూర్వాశ్రమంలో మాత్రం ఆమె ఓ నటి, మోడల్.

మోడలింగ్‌ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లారు. తాజాగా స్మృతీ ఇరానీ తాను మోడలింగ్ చేస్తున్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రంలో పూల పూల దుస్తులను ధరించి, కర్లీ హెయిర్‌తో స్టైలీష్‌గా వున్నారు కేంద్ర మంత్రి. అప్పుడు ఆమెకు 21 సంవత్సరాలు వుంటాయని తెలిపారు. 

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పాటు సెలబ్రెటీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘‘ రోజ్ ఈజ్ ఏ రోజ్’’ అంటూ మౌనీ రాయ్ వ్యాఖ్యానించారు. ‘‘ ఏం అందం మేడమ్. నేను మిమ్మల్ని ఎంతగానో ఆరాధిస్తాను. నా చిన్నతనంలో సాస్ బీ కబీ రోజుల నుంచి నేటి వరకు మీకు అభిమానిని ’’ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.  

కుటుంబం ఆర్ధిక పరిస్ధితుల కారణంగా స్మృతీ ఇరానీ 16 ఏళ్ల వయసులోనే దేశ రాజధాని ఢిల్లీలో ఓ కాస్మోటిక్స్ కంపెనీలో ఉద్యోం చేశారు. పని చేస్తూనే, డిస్టెన్స్‌లో చదువుకున్నారు స్మృతీ. అయితే మోడలింగ్‌కు ఎందుకు ప్రయత్నించకూడదన్న తన స్నేహితురాలి సలహాలతో ఎవరికీ తెలియకుండా మిస్ ఇండియా పోటీలకు ఆమె తన ఫోటోలను పంపింది. వడపోతలో ఎంతోమంది అందగత్తెలను పక్కకునెట్టి షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారామె. అయితే తదుపరి పోటీల కోసం ముంబైకి రావాల్సిందిగా ఆహ్వానం అందడంతో అప్పు చేసి ఆమెను పంపించారు తల్లిదండ్రులు. 

తన చలాకీతనం, విషయ పరిజ్ఞానంతో ఫైనల్ వరకు వెళ్లిన స్మృతీ ఇరానీ.. తృటిలో టైటిల్ మిస్సయ్యింది. అయినప్పటికీ మొండిగానే జీవితాన్ని కొనసాగించింది. మిస్ ఇండియా పోటీల కోసం చేసిన అప్పు తీర్చేందుకు ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఉద్యోగంలో చేరారు. అక్కడ టేబుల్స్ క్లీనింగ్ నుంచి ఆర్డర్లు తీసుకోవడం, సప్లయ్ చేయడం వరకు అన్ని పనులు చేసేది. అటు తనకు ఎంతో ఇష్టమైన మోడలింగ్ కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు మాత్రం ఆపేది కాదు. 

ఓ చిన్న ప్రకటనతో పాటు రెండు టెలీ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకున్న స్మృతీ ఇరానీని ప్రతిభ శోభా కపూర్ దృష్టికి వచ్చింది. ఆమె ఈ విషయాన్ని తన కుమార్తె ఏక్తా కపూర్‌కు చెప్పడంతో ‘‘క్యోంకీ సాస్ బీ కబీ బహో థీ ’’లో అవకాశం ఇచ్చారు. ఇందులోని తులసి పాత్ర స్మృతీ జీవితాన్నే మలుపు తిప్పింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios