న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో లాక్ డౌన్ అమలులో ఉంది. అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఆయన తనయుడు కూడా ఇంటికే పరిమితమయ్యారు. కొంత మంది లాగే వారు కూడా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ కొత్త జ్ఢాపకాలను సృష్టించుకుంటున్నారు.

లాక్ డౌన్ కారణంగా సెలూన్లు, బార్బర్ షాపులు మూతపడ్డాయి. ఈ స్థితిలో లోక్ జనశక్తి నేత చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ గడ్డాన్ని ట్రిమ్ చేశాడు. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

 

"కష్టకాలమే.. కానీ లాక్ డౌన్ వెలుతురు కోణాలను కూడా చూడండి. ఈ నైపుణ్యాలు కూడా ఉన్నాయని ఎప్పుడూ తెలియలేదు. కరోనా19పై పోరాడుదాం, అందమైన జ్ఢాపకాలను కూడా ప్రోది చేసుకుందాం" అని చిరాగ్ పాశ్వాన్ వీడియోకు తన వ్యాఖ్యను జత చేశారు.

పోస్టు చేసిన ఒక్క గంటలోనే ఆ వీడియోకు వేయి లైక్ లు వచ్చాయి. కేంద్ర మంత్రి కుర్చీలో కూర్చుని ఉండగా ఆయన తనయుడు ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ తో గడ్డం చేయడం వీడియోలో కనిపించింది. 

తన తండ్రికి సాయపడినందుకు ట్విట్టర్ యూజర్లు చిరాగ్ పాశ్వాన్ ను ప్రశంసిస్తున్నారు. "అద్భుతం. తండ్రి గడ్డాన్ని కొడుకు ట్రిమ్ చేయడం" అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఇటువంటి కుమారుడిని కన్నందుకు తండ్రి సంతోషించి ఉంటారు అని మరొకతను వ్యాఖ్యానించాడు.