రాహుల్‌ను దున్నతో పోల్చిన కేంద్రమంత్రి.. ఆయనపై విమర్శల వెల్లువ
కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్ దన్వే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై నోరుపారేసుకున్నారు. ప్రధానమంత్రిని పొగుడుతూ రాహుల్‌ను దున్నపోతుతో పోల్చి విమర్శలపాలయ్యారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా బీజేపీ నుంచి వ్యతిరేకత వచ్చింది.
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్‌సాహెబ్ దన్వే కొత్త వివాదానికి తెరలేపారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. సీనియర్ బీజేపీ నేత, కేంద్రమంత్రి రావ్‌సాహెబ్ దన్వే జన ఆశీర్వాద యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీతో ఏమీ ఒరిగేది లేదని, ఆయనతో ఎవరికీ ప్రయోజనం లేదని కేంద్రమంత్రి విమర్శలు చేశారు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పని తీరును చూడాలని అన్నారు. ఆయన సదా ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో మునిగిపోతారని తెలిపారు. రాహుల్ గాంధీని దున్నపోతుతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
కాంగ్రెస్ మహారాష్ట్ర యూనిట్ చీఫ్ నానా పటోలె కేంద్రమంత్రిపై అగ్గిమీద గుగ్గిళమయ్యారు. దన్వే అన్ని హద్దులు దాటాడని, ఆయన వ్యాఖ్యలు అసభ్యకరమని, అనాగకరికమని అన్నారు. ఆ మంత్రివర్యుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఓ సీనియర్ బీజేపీ నేత కూడా దన్వేపై విమర్శలు చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఆయన తన ఉద్దేశ్యాన్ని ప్రజలకు సూటిగా తెలియజెప్పడానికి ఎక్కువగా ఉదాహరణలు వాడుతుంటాడని, కానీ, ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. రాజకీయంలో ప్రతి ఒక్కరు భాషను
అదుపులో ఉంచుకుని వాడుకోవాలన్నారు. ముఖ్యంగా మంత్రిహోదాలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడాలని తెలిపారు.