ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న వివాదం రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ఆ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. కంగనా విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని, అనవసరంగా ఆమెకు ప్రచారం కల్పిస్తున్నారని శరద్ పవార్ ఉద్ధవ్ థాకరేతో అన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే రంగంలోకి దిగారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎలో ఆయన భాగస్వామి అనే విషయం తెలిసిందే. అథవాలే కంగనా రనౌత్ తో సమావేశమయ్యారు. తనకు అవమానం జరిగిందని, తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతోందని అథవాలే గురువారంనాడు అన్నారు. తమ మద్దతు ఉంటుందని అథవాలే కంగనాకు చెప్పారు.

Also Read: కంగనకు సౌత్‌ స్టార్ మద్దతు.. భగత్‌ సింగ్‌తో పోలుస్తూ!...

కంగనాను తాను కలిసి గంట సేపు మాట్లాడానని, ముంబైలో భయానికి గురి కావాల్సిన అవసరం లేదని తాను చెప్పానని, ముంబై దేశ ఆర్థిక రాజధాని అని, ఎవరికైనా ఇక్కడ జీవించే హక్కు ఉందని, తన ఆర్పీఐ మద్దతు ఇస్తుందని తాను కంగనాకు చెప్పినట్లు ఆయన తెలిపారు. 

Also Read: కూలిన ఆఫీస్‌ చూసి కంగనా కన్నీళ్ళు.. ఉద్ధవ్‌ ఠాక్రేకి వార్నింగ్‌

జనవరిలో తాను నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేశారని కంగనా చెప్పిందని, ఆ నిర్మాణాన్ని బిఎంసీ కూల్చివేస్తే సరిపోయేదని, అయితే లోపలి గోడలనూ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారని కంగనా వివరించిందని ఆయన అన్నారు. దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిందని, తనకు నష్టపరిహారం కావాలని కంగనా అడుగుతోందని అథవాలే అన్నారు.