బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌, మహారాష్ట్ర ప్రభుత్వ మధ్య యుద్ధ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌, ఆయన మాజీ మేనేజర్‌ దిశ మృతికి ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రేకు సంబంధాలు ఉన్నట్టుగా కంగన ఆరోపణలు చేయటంతో వివాదం మొదలైంది. దీనికి తోడు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, కంగనల మధ్య మాటల యుద్దం పరిస్థితిని మరింత వేడెక్కించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కంగనకు వై కేటగిరి భద్రత ఏర్పాటు చేయటం, అదే సమయంలో బీఎంసీ అధికారులు ముంబైలోని కంగనా ఆఫీస్‌ బిల్డింగ్‌కు సరైన అనుమతులు లేవంటూ కూల్చేందుకు నిర్ణయించటంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పరిస్థితుల్లోనే ముంబైలో అడుగుపెట్టిన కంగన, మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయంలో పలువురు కంగనపై విమర్శలు చేస్తుండగా మరికొందరు ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు.

తాజాగా సౌత్ స్టార్ హీరో విశాల్, కంగన భగత్‌ సింగ్‌తో పోలుస్తూ ట్వీట్‌ చేయటం చర్చనీయాంశమైంది. `గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరూ సాహసించరు. కానీ మీరు చాలా ధైర్యంగా ప్రభుత్వాన్ని ఎదుర్కుంటున్నారు. ఓ సెలబ్రిటీలా కాకుండా సామాన్య మహిళగా పోరాడుతున్నారు. నేను మీకు నమస్కరిస్తున్నాను` అంటూ ఓ లెటర్‌ను రిలీజ్ చేశాడు విశాల్‌.