కర్ణాటకకు బకాయిలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
కర్ణాటక రాష్ట్రానికి పెండింగ్ బకాయిల విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు చేశారు.
న్యూఢిల్లీ: రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు.కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా బట్టబయలు చేశారని సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి ప్రస్తావించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు వెతుకుతుందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లపై కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు.
ఫైనాన్స్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడం లేదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు.
ఈ సందర్భంగా లోక్ సభలో కాంగ్రెస్ పక్ష సభ్యుడు అధిర్ రంజన్ చౌదురి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానానికి సంబంధించిన వీడియో క్లిప్ ను కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.