పార్లమెంటు పనితీరును కూడా రాజకీయం చేసే ప్రయత్నం: సోనియా గాంధీపై కేంద్రమంత్రి ఫైర్
పార్లమెంటు పనితీరును కూడా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది దురదృష్టకరం అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్ అయ్యారు. ఆమె అనవసరంగా వివాదానికి ఆజ్యం పోస్తున్నారని అన్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై విమర్శలు సంధించారు. ఆమె పార్లమెంటు పని తీరును కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అక్కర్లేని వివాదాన్ని ఆమె తయారు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక సమావేశం గురించి అజెండా కోరుతూ సోనియా గాంధీ ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి అజెండాను లిస్ట్ చేయలేదని ఆమె తెలిపారు. అందులో మణిపూర్, ధరల పెరుగుదల సహా తొమ్మిది విషయాలు చేర్చాలని ఆమె ప్రతిపాదించారు. ఈ లేఖ రాసిన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమెపై విమర్శలు చేశారు.
‘ప్రజాస్వామ్యానికి కోవెల వంటి పార్లమెంటు పని తీరును మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. అక్కరలేని ఓ వివాదానికి ఆజ్యం పోస్తున్నారు.’ అని ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు.
Also Read: భాగస్వామిని ఎంచుకునే, సహజీవనంలో పిల్లల హక్కుల్లో పేరెంట్స్ జోక్యం చేసుకోరాదు: హైకోర్టు
నిర్దేశిత ప్రక్రియను అమలు చేస్తూనే సెప్లెంబర్ 18వ తేదీన పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఇలా ప్రత్యేక సమావేశాల కోసం రాజకీయ పార్టీలను ముందస్తుగానే ఇది వరకు ఎప్పుడూ సంప్రదించలేదని వివరించారు.
ప్రధాని మోడీకి రాసిన లేఖలో సోనియా గాంధీ లేవనెత్తిన అంశాలపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంలోనే సమాధానాలు ఇచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.