భాగస్వామిని ఎంచుకునే, సహజీవనంలో పిల్లల హక్కుల్లో పేరెంట్స్ జోక్యం చేసుకోరాదు: హైకోర్టు
భాగస్వామిని ఎంచుకునే హక్కు, పెళ్లి చేసుకుని లేదా కలిసి జీవించే హక్కు మైనార్టీ తీరిన అబ్బాయి, అమ్మాయికి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మతాంతర వివాహం చేసుకుని బెదిరింపులు తాళలేక హైకోర్టును ఆశ్రయించిన వారి పిటిషన్ విచారిస్తూ పై వ్యాఖ్యలు చేసింది.

న్యూఢిల్లీ: వేర్వేరు మతాలకు చెందిన మైనార్టీ తీరిన ఇద్దరి సహజీవనంలో తల్లిదండ్రులు, వారి వకాల్తా పుచ్చుకునే మరెవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. శాంతియుతంగా జీవిస్తున్న వారి మధ్యలోకి ఎవరు వచ్చి డిస్టర్బెన్స్ సృష్టించినా వారు ఈ కోర్టు ఆదేశాల పత్రాన్ని తీసుకుని ఎస్పీ వద్ద నుంచి భద్రత తీసుకోవచ్చని సూచించింది.
సుప్రీంకోర్టు రూలింగ్స్‌ను ఉటంకిస్తూ అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. మైనార్టీ తీరిన అమ్మాయి, అబ్బాయి వారికి ఇష్టం ఉన్న భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారని, వారిని పెళ్లి చేసుకోవడం, కలిసి జీవించే హక్కు కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21 దఖలు పరుస్తున్నాయని ధర్మాసనం తెలిపింది.
Also Read : బీజేపీకి సుభాశ్ చంద్రబోస్ మునిమనవడు రాజీనామా.. ‘నేతాజీ లక్ష్యాల ఛేదనకు పార్టీ సహకరించలేదు’
అమ్మాయి తల్లి, వారి కుటుంబ సభ్యుల నుంచి వీరి సంబంధంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, వారిద్దరికీ బెదిరింపులు చేసినట్టూ ఆ జంట తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ అబ్బాయిని మతదురహంకార హత్య కూడా చేసే ముప్పు ఉన్నదని పేర్కొన్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో వారు సీఐని ఆశ్రయించినా భద్రతా లభించలేదని వివరించారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారిస్తూ శాంతియుతంగా జీవిస్తున్న ఆ జంట జోలికి ఎవరూ వెళ్లకూడదని, తల్లిదండ్రులు, వారి తరఫున మరెవరైనా వారి జీవితాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.