లోక్ సభ ఎన్నికలు ఈ ఏడాది చివరిలోనే ముందస్తుగా జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని బిహార్ సీఎం నితీశ్ కుమార్ బుధవారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అయితే, ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం తోసిపుచ్చారు. 

న్యూఢిల్లీ: బిహార్ సీఎం నితీశ్ కుమార్ వచ్చే లోక్ సభ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. ఆ ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలోని బీజేపీని గద్దె దింపాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా స్వయంగా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటి మీదికి తీసుకువచ్చే బాధ్యతను భుజం పై వేసుకున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన సార్వత్రిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ఉన్నది. కానీ, ఈ ఏడాది చివరిలోనే ముందస్తుగానే లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని నితీశ్ కుమార్ బుధవారం పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇతర అన్ని పార్టీల్లోనూ చర్చకు వచ్చాయి. నిజంగానే సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా జరిగే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో చర్చలు జరిగాయి. అయితే, మోడీ ప్రభుత్వంలోని మంత్రి ఈ వ్యాఖ్యలపై స్పందించారు. బిహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా ఉన్న గిరిరాజ్ సింగ్ గురువారం నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చారు.

Also Read: ఆదిపురుష్‌ సినిమాలో సీఎం ఏక్‌నాథ్ షిండే ఉన్నాడా? అంటూ నెటిజన్ ట్వీట్.. నెంబర్ షేర్ చేయమంటూ పోలీసుల రియాక్షన్

నితీశ్ కుమార్ ఒక జ్యోతిష్కుడి అవతారం ఎత్తడం చూస్తే సంతోషంగా ఉన్నదని వ్యంగ్యం పోయారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఆయన ఓ ఘాటు సామెతనూ ఉపయోగించాడు. తన పెళ్లినే చక్కబెట్టుకోలేనాయన.. వేరే వాళ్లకు పెళ్లి సంబంధాలు చూశారంటా.. అంటూ విరుచుకుపడ్డారు. అదే విధంగా రాష్ట్ర సమస్యలనే పట్టించుకోని.. రాష్ట్రంలో పాలనను సమర్థవంతంగా చేపట్టడం చేతకాని నితీశ్ కుమార్.. రాష్ట్రం వెలుపల వ్యవహారాలపై అత్యధిక ఆసక్తి కనబరుస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.