జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎన్నికలను వాయిదా వేయడమో.. ముందస్తుగా నిర్వహించడమో చేయబోమని, అలాంటి ఆలోచనలేవీ ప్రభుత్వం చేయడం లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లోక్ సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలనే ఆలోచనలేవీ ప్రభుత్వానికి లేవని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వ చివరి రోజు వరకు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. 

జాతీయ మీడియాకు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనూ వాయిదా వేయాలని, తద్వార లోక్ సభతో కలిపే ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ఎన్నికలను ముందస్తుగా నిర్వహించడం లేదా.. వాయిదా వేయడం అనే చర్చ మొత్తం కూడా మీడియా చేస్తున్నదేనని కొట్టి పారేశారు. 

కేంద్ర ప్రభుత్వం ఒక దేశం, ఒక ఎన్నికల కోసం కమిటీ వేసిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ కమిటీ విస్తృతమైన సంప్రదింపులు జరుపుతుందని వివరించారు. ఆ తర్వాతే వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు నిబంధనలను ఖరారు చేస్తుందని తెలిపారు. ఈ కమిటీలో ప్రతిపక్ష గళం కూడా ఉండాలని తాము భావించామని, అందుకే లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిని చేర్చామని వివరించారు.

ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంతో జమిలి ఎన్నికలపై చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సమావేశాల గురించీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ప్రణాళికలు ఉన్నాయని, కానీ, వాటిని ఇప్పుడే వెల్లడించలేనని చెప్పారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశానికి అజెడాను సరైన సమయంలో పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడిస్తారని వివరించారు.

Also Read: జమిలి ఎన్నికలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?

జమిలి ఎన్నికలపై అటు రాజకీయ పార్టీలు, నిపుణులు విస్తృతంగా చర్చిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. కేంద్రంలో అధికారాన్ని పొడిగించుకోడానికే జమిలి ఎన్నికలను తేవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తీసేసి దాని స్థానంలో అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని తీసుకురావలని ప్రయత్నిస్తున్నదనీ ఆరోపణలు చేశాయి. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు సంకటం అని, ఈ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆందోళనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల పై స్పష్టత ఇచ్చింది. అయితే.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలపై మాత్రం ఉత్కంఠ అలాగే కొనసాగుతున్నది.