కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా విలేకరులపై విరుచుకుపడ్డారు. జైలులో ఉన్న తన కొడుకు అశిష్ మిశ్రాపై ప్రశ్నలు వేయగానే ఆయన సహనం కోల్పోయి విలేకరులను దూషించారు. మైక్ లాక్కున్నారు. మీరంతా దొంగలు అంటు తిట్టారు. ఈ ఘటన లఖింపూర్ ఖేరి ఘటన జరిగిన రీజియన్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం. లఖింపూర్ ఖేరిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కేంద్ర మంత్రిని విలేకరులు ప్రశ్నించారు.
లక్నో: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా(Ajay Mishra) విలేకరుల(Journalists) పై విరుచుకుపడ్డారు. జైలు పాలైన తన కొడుకు గురించి ప్రశ్నలు వేయగానే ఆయన సహనం కోల్పోయారు. ఒక్క ఉదుటున విలేకరులపైకి దూసుకు వెళ్లారు. మైక్ లాక్కున్నారు. మరొకరిని ఫోన్ తీయవద్దు.. జేబులో పెట్టుకోవాలని సీరియస్ అయ్యారు. ఆ విలేకరులను (Abuses)దూషించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా జైలులోని తన కొడుకు అశిష్ మిశ్రాను కలిసిన తర్వాతి రోజే ఆయన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరికి వెళ్లారు. అక్కడ ఓ ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించడానికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి లఖింపూర్ ఖేరి వెళ్లిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఆయన కొడుకు అశిష్ మిశ్రా గురించి విలేకరులు ప్రశ్నించారు. లఖింపూర్ ఖేరిలో రైతులను ఉద్దేశ్యపూర్వకంగానే చంపారన్న కమిటీ రిపోర్టు గురించీ అడిగారు. దీంతో ఆయన ఆగ్రహించారు. విలేకరులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లారు. సహనం కోల్పోయి దూషణలు చేశారు. మీరంతా దొంగలు అని తిట్టారు. ఏం కావాలి మీకు? ఏం సమాచారం కావాలి? అంటూ ఆగ్రహించారు.
లఖింపూర్ ఖేరిలో అప్పుడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నా చేస్తుండగా అశిష్ మిశ్రా నడుపుతున్నట్టు ఆరోపణలు ఉన్న ఎస్‌యూవీ కారు రైతుల పైకి దూసుకెళ్లింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ స్వీకరించింది. ఈ విచారణలో భాగంగా ఏర్పాటైన దర్యాప్తు ప్యానెల్ తాజాగా ఓ రిపోర్టు వెలువరించింది. ఆ రిపోర్టు ప్రకారం, రైతులపైకి ఆ కారు నడుపుతున్న వారు ఉద్దేశ్యపూర్వకంగా తీసుకెళ్లారని పేర్కొంది. మర్డర్ చేయాలనే స్పష్టమైన కుట్రతోనే కారు వారిపైకి దూసుకెళ్లిందని, అది నిర్లక్ష్యంగా జరిగిన ఘటన కాదని తెలిపింది.
ఈ రిపోర్టుతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై ఒత్తిడి మరింత పెరిగింది. ఘటన జరిగిన తర్వాతే ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తాజాగా, ప్యానెల్ రిపోర్టుతో మరోసారి ఆయనపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆ రిపోర్టు గురించి నేరుగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రానే విలేకరులు ప్రశ్నలు వేయడంతో ఆయన సహనం కోల్పోయారు.
Also Read: Lakhimpur Violence: పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ ఘటన.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్న సిట్
లఖింపూర్ ఖేరి కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిష్ మిశ్రా సహా పలువురిపై హత్యా నేరారోపణలు, కుట్ర ఆరోపణల కింద కేసు నమోదైంది. ఈ కేసులో వారు ప్రస్తుతం జైలులో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri ) ఘటనను ప్రణాళికబద్దమైన కుట్రగా (planned conspiracy) ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పాటుగా ప్రతిపక్షాలు బీజేపీ విమర్శల దాడిని పెంచాయి. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో.. అతడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీ మరోసారి క్షమాపణలు చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై లోక్‌సభలో బుధవారం విపక్షాలు ఆందోళకు దిగాయి. సభలో సిట్ నివేదికపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.
