పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని మమతా బెనర్జీ.. తొలిసారి బెంగాల్‌లో పాగా వేయాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు.

దీనిలో భాగంగానే బీజేపీ తన అతిరథ మహారథులను రంగంలోకి దించుతోంది. తాజాగా బెంగాల్‌లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలు ఆమెను క్షమించరని .. మార్పు తెస్తానని ఇచ్చిన హామీని ఆమె మర్చిపోయారంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. ఆదివారం హౌరాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 

గత పదేళ్ళలో ఆమె నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పరిశీలిస్తే, ఆ హామీలను ఆమె మర్చిపోయినట్లు తెలుస్తుందని హోంమంత్రి ఎద్దేవా చేశారు. తల్లి, జన్మభూమి, ప్రజలు - నినాదం తెరవెనుకకు పోయిందని ఆయన దుయ్యబట్టారు.

శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారని అమిత్ షా గుర్తుచేశారు. మమత దీదీ వెనుకకు తిరిగి చూసుకుంటే ఎవరూ కనిపించరని ఆమె ఇక ఒంటరేనని ఆయన వ్యాఖ్యానించారు. 

అనంతరం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ... అంతఃకలహాలను ప్రోత్సహించే పార్టీలో ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. ‘జై శ్రీరామ్’ను అవమానించే పార్టీలో ఎవరూ కొనసాగరని ఆమె హితవు పలికారు.

‘జై శ్రీరామ్’ నినాదాన్ని మమత బెనర్జీ వదిలిపెట్టినప్పటికీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రామాలయం నిర్మితమవుతోందని స్మృతి గుర్తుచేశారు. రామరాజ్యం పశ్చిమ బెంగాల్ తలుపు తడుతోందని ఆమె వెల్లడించారు.