గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి తమ పార్టీకి మెజార్టీ వస్తే భూపేంద్ర పటేల్ తదుపరి సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు.  

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి తమ పార్టీకి మెజార్టీ వస్తే భూపేంద్ర పటేల్ తదుపరి సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఈసారి కీలకంగా మారాయి. సుదీర్ఘకాలంగా అధికారంలో వుండటంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత వున్నప్పటికీ మరోసారి ఇక్కడ గెలవాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఎప్పటిలాగే సీఎం అభ్యర్ధి ఎవరనేది కమలనాథులు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీ స్థానంలో భూపేంద్ర పటేల్‌ను బీజేపీ పెద్దలు గుజరాత్ సీఎంగా నియమించిన సంగతి తెలిసిందే. 

ALso REad:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు .. నామినేషన్ దాఖలు చేసిన జడేజా భార్య

ఇకపోతే.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 100 మంది పేర్లతో కూడిన జాబితాను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ జాబితాలో రివాబా జడేజా పేరు కూడా ఉంది. ఆమె జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలవననున్నారు. ఈ స్థానంలో ప్రస్తుతం బీజేపీకే చెందిన ధర్మేంద్రసింగ్ జడేజా ఉన్నారు. అయితే ఈ సారి ఆ స్థానం నుంచి రివాబా జడేజాను బీజేపీ బరిలో నిలపాలని నిర్ణయం తీసుకుంది. 

ఇదిలా ఉంటే.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి, పాటిదారు ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. విరాంగ్రామ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలువనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పార్టీ సీనియర్ నేత భూపేంద్రసింగ్ చుడాసమా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇక, 182 మంది సభ్యులున్న గుజరాత్ శాసనసభకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ పోలింగ్.. డిసెంబర్ 1న, రెండో దశ పోలింగ్.. డిసెంబర్ 5న జరగనుంది. రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. ఈసారి కూడా గుజరాత్‌లో విజయం సాధించి.. వరుసగా ఆరోసారి అధికారాన్ని చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా గుజరాత్‌లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.