అందరూ ఊహించినట్లుగానే త్వరలో ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలకు నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. వచ్చే ఆరు నెలల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి, కేరళ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఈ ఐదు రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. తమిళనాడులో దాదాపు 3,500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయలను కేటాయించారు.

మధురై-కొల్లమ్ కారిడార్, చిత్తూరు-తత్చూరు కారిడార్ ప్రాంతాల్లో ఈ రహదారులు నిర్మాణం జరగనుంది. వచ్చే ఏడాది నుంచే ఈ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి.

ఇక కేరళ విషయానికి వస్తే దాదాపు 1100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 65 వేల కోట్లను కేటాయించారు. ముంబై-కన్యాకుమారి కారిడార్ ను కూడా దీనిలో భాగంగానే నిర్మాణం చేయనున్నారు.

ఇక పశ్చిమ బెంగాల్‌లో కూడా 6,700 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 25 వేల కోట్ల రూపాయలను వీటికి కేటాయించారు. 19 వేల కోట్ల రూపాయలతో అసోంలో రహదారుల నిర్మాణం జరుగనుంది. 

Also Read:కేంద్ర బడ్జెట్ 2020-21: పెరగనున్న మొబైల్ ధరలు, తగ్గనున్న బంగారం, వెండి ధరలు

ఇక ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల విషయంలో కూడా నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ల విషయంలో ప్రస్తుతానికి ప్రేవేటు రంగాన్ని దూరంగానే ఉంచాలని నిర్ణయించామని వెల్లడించారు.

వారికి ఈ నిర్ణయం నిరాశ కలిగించవచ్చు.. కానీ దేశ ప్రజల శ్రేయస్సు కోసం తప్పడం లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొదటి విడతగా ఇస్తున్న కరోనా వ్యాక్సిన్ల ఒక్కో డోసు ధర 255 రూపాయలుగా నిర్ణయించామన్నారు.

బడ్జెట్లో కేటాయించిన మొత్తం రెండు డోసులకు గానూ ఏకంగా 68.6 కోట్ల మంది భారత ప్రజలకు సరిపోతుందని.. అవసరాన్ని బట్టి ఆ మొత్తాన్ని పెంచుతామని విత్త మంత్రి స్పష్టం చేశారు.