ఆసియా క్రీడలు : పతకాల పంట పండించిన క్రీడాకారులకు రాజ్‌నాథ్ సింగ్ భారీ నజరానా.. ఒక్కొక్కరికి ఎంతంటే..?
హంగ్‌జౌ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు వారి కృషిని గుర్తించి ముందుకు సాగేలా ప్రోత్సహించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారీ బహుమతిని ప్రకటించారు. బంగారు పతక విజేతలకు రూ.25 లక్షలు.. రజత పతక విజేతలకు రూ.15 లక్షలు.. కాంస్య పతక విజేతలకు రూ.10 లక్షలు అందజేయనుంది.
హంగ్‌జౌ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు వారి కృషిని గుర్తించి ముందుకు సాగేలా ప్రోత్సహించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారీ బహుమతిని ప్రకటించారు. మంగళవారం భారత సాయుధ దళాలకు చెందిన ఆసియా క్రీడల పతక విజేతలతో సంభాషిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. రాజ్‌నాథ్ ప్రకటన ప్రకారం.. రక్షణ మంత్రిత్వ శాఖ బంగారు పతక విజేతలకు రూ.25 లక్షలు.. రజత పతక విజేతలకు రూ.15 లక్షలు.. కాంస్య పతక విజేతలకు రూ.10 లక్షలు అందజేయనుంది.
క్రీడాకారులతో సంభాషించిన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో మొత్తం 107 పతకాలు సాధించామన్నారు. చివరిసారిగా 2018లో తాము 70 పతకాలు సాధించామని రక్షణ మంత్రి గుర్తుచేశారు. 70 పతకాల నుంచి 107 పతకాల వరకు సాగిన ఈ ప్రయాణాన్ని పరిశీలిస్తే దాదాపు 50 శాతం పెరుగుదల కనిపించిందని రాజ్‌నాథ్ అన్నారు. భారత్ చంద్రుడిని కూడా చేరుకుందని.. ప్రపంచంలోని అతిపెత్త సంస్థలు భారతదేశ అభివృద్ధిని అంగీకరిస్తున్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. అవి ప్రపంచ బ్యాంక్ లేదా ఐఎంఎఫ్ కావొచ్చు అని రాజ్‌నాథ్ అన్నారు.
ఈ సారి ఆసియా క్రీడలకు వెళ్లడానికి ముందే .. 'This time, 100 crosses' అనే నినాదాన్ని ఇచ్చామన్నారు. ఖచ్చితంగా 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రమించి మా కలను నెరవేర్చారని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ రోజు మనదేశం ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనను అందించి 107 పతకాలు సాధించిందని రక్షణ మంత్రి చెప్పారు. 2022 ఆసియా క్రీడల్లో క్రికెట్ , కబడ్డీ తదితర క్రీడల్లో భారత్ ఆధిపత్యాన్ని చూపిందన్నారు. మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో మెరుగైన టీ20 ర్యాంకింగ్ ఆధారంగా భారత్ స్వర్ణం ముద్దాడింది.