ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) ప్రపంచ దేశాల జనాభా డేటాను విడుదల చేసింది. అయితే ప్రపంచ జనాభా డాష్‌బోర్డ్‌లో భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చిత్రీకరించడం ద్వారా వివాదాన్ని రేకెత్తించింది
ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) ప్రపంచ దేశాల జనాభా డేటాను విడుదల చేసింది. అయితే ప్రపంచ జనాభా డాష్‌బోర్డ్‌లో భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చిత్రీకరించడం ద్వారా వివాదాన్ని రేకెత్తించింది. ప్రపంచ పటంలో.. జమ్మూ కాశ్మీర్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్, లద్దాఖ్ భాగాలను వదిలివేసింది. అయితే ఐకరాజ్య సమితి భారతదేశ మ్యాప్‌ను తప్పుగా చిత్రీకరించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు.. జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను ప్రత్యేక ప్రాంతాలుగా పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి.
అయితే ఈసారి యూఎన్‌ఎఫ్ఏ.. ప్రపంచ పటంలో అక్సాయ్ చిన్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌ల వివాదాస్పద సరిహద్దును ప్రత్యేక ప్రాంతంగా చూపించింది. అదే సమయంలో పీఓకే(పాక్ అక్రమిత కాశ్మీర్)ను మాత్రం పాకిస్థాన్‌లో భాగంగా చూపెట్టింది.
Also Read: చైనాను దాటేసింది.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్.. జనాభా ఎంతంటే..
అయితే ప్రపంచ జనాభా డాష్‌బోర్డ్ క్రింద ఉన్న డిస్‌క్లైమర్‌లో మాత్రం.. ‘‘ఈ మ్యాప్‌లో చూపబడిన సరిహద్దులు, పేర్లు, ఉపయోగించిన హోదాలు ఐక్యరాజ్యసమితి అధికారిక ఆమోదం లేదా అంగీకారాన్ని సూచించవు.’’ అని పేర్కొంది. అయితే ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) భారతదేశ మ్యాప్‌ను తప్పుగా చిత్రీకరించింది. ఈ సమస్యను భారతదేశం లేవనెత్తిన తర్వాత దాని వెబ్‌సైట్‌లో డిస్‌క్లైమర్ ఉంచవలసి వచ్చింది. డబ్ల్యూహెచ్‌వో వెబ్‌సైట్.. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలను భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన రంగులలో చూపించింది. మ్యాప్‌లో భారతదేశంలోని ఈ కేంద్రపాలిత ప్రాంతాలను బూడిద రంగులో ఉంచి.. మిగిలిన మొత్తం ప్రాంతాన్ని ముదురు నీలం రంగులో చూపించారు. భారతదేశం, చైనా మధ్య వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన అక్సాయ్ చిన్ కూడా నీలం రంగు చారలతో బూడిద రంగులో ఉంచింది.
ఇక, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలిచింది. ఇన్నాళ్లు అత్యధిక జనాభా జాబితాలో నెంబర్ 1 స్థానంలో ఉన్న చైనాను భారత్ బీట్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్లు ఐకరాజ్య సమితి డేటా వెల్లడించింది. భారత్ జనాభా 142.86 కోట్లు ఉన్నట్టుగా ఐకరాజ్య సమితి తెలిపింది. ఇక, చైనా జనాభా 142.57 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. యూఎన్‌ఎఫ్‌పీఏ ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023 ప్రకారం.. భారతదేశ జనాభా 1,428.6 మిలియన్లకు చేరుకోగా.. చైనా జనాభా 2.9 మిలియన్ల తేడాతో 1,425.7 మిలియన్లుగా ఉందని తెలిపింది.
