Russian Ukraine Crisis: ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి తన కార్యాలయాలను ఉపయోగించాలని ఆనంద్‌పూర్ సాహిబ్ ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. 

Russian Ukraine Crisis: ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి తన కార్యాలయాలను ఉపయోగించాలని ఆనంద్‌పూర్ సాహిబ్ ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. మనీష్ తివారీ మాట్లాడుతూ.. ఉక్రేనియన్-పోలిష్ సరిహద్దులో అక్క‌డి పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని, భార‌తీయ విద్యార్థుల దుస్థితికి సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. హృదయం క‌లిచివేస్తుందని అన్నారు. ఇది క్లిష్ట పరిస్థితి అని తెలుసు..

కానీ, మ‌న దేశానికి చెందిన దాదాపు 20,000-30,000 మంది విద్యార్థులు.. ఇప్పటికీ ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, వారిలో చాలా మంది రష్యాకు దగ్గరగా ఉన్న తూర్పు ఉక్రెయిన్ పాంత్రంలో చిక్కుకున్నారని, ప్ర‌స్తుత పరిస్థితుల్లో ప్రతి భారతీయుడిని ఉక్రెయిన్ నుండి సురక్షితంగా బయటకు తీసుకురావాలని అన్నారు. ఇందుకు అవసరమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌ర‌లింపుకు కావాల్సిన వ‌నరులను రెట్టింపు చేయాల‌ని, తరలింపును పర్యవేక్షిస్తున్న మంత్రులకు సలహా ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు.

రష్యాకు నిరసన సెగ 

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ప్రజాస్వామ్య హక్కుల సంస్థలు సోమవారం సంగ్రూర్ పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ యూనియన్, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సహజ వనరుల దోపిడీకి సామ్రాజ్యవాద శక్తులు ఉక్రెయిన్‌ను ఓ పావుగా మార్చాయ‌నీ, అన్యాయమైన యుద్ధంలో కోట్లాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతారని ఎన్‌బిఎస్‌ రాష్ట్ర చీఫ్‌ రూపిందర్‌ చౌండా అన్నారు.

PSU నాయకుడు సుఖ్‌దీప్ హతన్ మాట్లాడుతూ.. ఈ యుద్ధానికి రష్యా బాధ్యత వహించినప్పటికీ, NATO ను విస్త‌రించాల‌నే ఆలోచ‌న అమెరికాది, ఈ రెండు దేశాల కార‌ణంగా ఉక్రెయిన్ బ‌లిప‌శువుగా మారింద‌ని అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, అక్కడ చిక్కుకుపోయిన భారతీయులందరినీ వెనక్కి తీసుకురావాలని ఆయన అన్నారు.