రేపు అక్షరధామ్ ఆలయానికి యూకే పీఎం రిషి సునాక్.. ఆయన ఏమన్నారంటే?
యూకే ప్రధాని రిషి సునాక్ భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జీ 20 సదస్సు కోసం ఆయన మూడు రోజుల పర్య టనలో ఉన్నారు. శుక్రవారం విచ్చేసిన ఆయన రేపు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు.

న్యూఢిల్లీ: యూకే పీఎం రిషి సునాక్ ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్‌ను రేపు సందర్శించనున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన రిషి సునాక్ మూడు రోజుల పర్యటనలో చివరి రోజున ఆయన అక్షరధామ్ టెంపుల్ వెళ్లనున్నారు. రిషి సునాక్ శుక్రవారం తనను తాను గర్వపడే హిందువుగా పేర్కొన్నారు.
‘నేను హిందువుగా గర్విస్తాను. నన్ను ఒక హిందువుగానే పెంచారు. నేను అలాగే ఉన్నాను. ఈ రెండు రోజుల్లో నేను గుడికి వెళ్లుతాననే అనుకుంటున్నాను’ అని రిషి సునాక్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొన్నారు. రిషి సునాక్ రక్షా బంధన్ పండుగ జరుపుకున్నట్టు చెప్పారు. అయితే.. క్రిష్ణ జన్మాష్టమి సరిగా జరుపుకునే సమయం లేకపోయిందని వివరించారు. అందుకే ఈ పర్యటనలో ఓ ఆలయాన్ని సందర్శించాలని భావిస్తున్నట్టు చెప్పారు.
Also Read: G20 Summit 2023: న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు జీ 20 దేశాల ఆమోదం: ప్రకటించిన ప్రధాని మోడీ
రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శుక్రవారం ఢిల్లీకి విచ్చేశారు. వారిని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే స్వాగతించారు. జై సియా రామ్ అంటూ వారిని ఆహ్వానం పలికారు. వారికి ఒక రుద్రాక్ష, భగవత్‌గీతా, హనుమాన్ చాలీసాను అందించారు.