G20 Summit 2023: న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు జీ 20 దేశాల ఆమోదం: ప్రకటించిన ప్రధాని మోడీ
జీ 20 సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు జీ 20 సభ్యదేశాలు సమ్మతం తెలుపాయి. ఈ జాయింట్ డిక్లరేషన్‌కు ఆమోదం పొందిన విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా మీడియాకు వెల్లడించారు.
న్యూఢిల్లీ: మన దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న జీ 20 సదస్సులో కీలక పరిణామాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను జీ 20 ఆమోదించినట్టు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, దాని చుట్టూ ఉన్న సవాళ్లపై జీ 20 దేశాల సంయుక్త డిక్లరేషన్ కోసం కసరత్తు జరిగింది. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను జీ 20 గ్రూపులోని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. భారత్ మాత్రం తటస్థ వైఖరి అవలంభిస్తున్నది. శాంతి కోసం చర్చలు జరపాలని సూచిస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా జాయింట్ డిక్లరేషన్ పై జీ 20 దేశాల ఆమోదం లభించడం కష్టమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. జాయింట్ డిక్లరేషన్‌లోని భాషలో పలుమార్పుల చేస్తూ.. ప్రకటనలను సవరించిన తర్వాత ఈ దేశాలు ఆమోదం తెలిపినట్టు సమాచారం.
‘నాకు ఇప్పుడే ఓ శుభ వార్త అందింది. మా బృందాల హార్డ్ వర్క్‌తో న్యూ ఢిల్లీ జీ20 లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్ పై ఆమోదం లభించింది. ఇదే సందర్భంలో లీడర్షిప్ డిక్లరేషన్ పై కూడా సమ్మతం తెలుపాలని కోరుతున్నాను. ఈ డిక్లరేషన్‌ను కూడా అడాప్ట్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతినిధులు, మంత్రులకు కృతజ్ఞతలు. వారి కృషితోనే ఈ జాయింట్ డిక్లరేషన్ సాధ్యం అయింది’ అని ప్రధాని మోడీ అన్నారు.
సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో కీలక అంశాలు, పరిణామాలపై సభ్య దేశాల ఏకాభిప్రాయాన్ని వెల్లడించడానికి ఇలాంటి డిక్లరేషన్‌లు చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం ఇంకా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. దీన్ని పశ్చిమ దేశాలు ఎంతమాత్రం అంగీకరించడం లేదు. రష్యా కూడా సభ్యదేశమే అయిన జీ 20లో ఈ అంశం కారణంగా డిక్లరేషన్ పై అన్ని దేశాల అంగీకారం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వచ్చాయి. అయితే, చర్చ తో ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని, శాంతి మంత్రం పాటించిన భారత్ నిర్వహిస్తున్న సదస్సులో ఈ సంయుక్త ప్రకటనకు ఆమోదం లభించడం కీలక విజయంగా భావిస్తున్నారు.
ఈ శిఖరాగ్ర సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాకు తోడుగా నిలిచిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా రాకవపోడం గమనార్హం. ఈ దేశాల ప్రతినిధులు మాత్రం హాజరయ్యారు.