ఉజ్జయిని అత్యాచార ఘటన : పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన బాలిక.. కానీ ఆలోపే..
ఉజ్జయినిలో అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలిక పరీక్ష రాసేందుకు అని ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరింది. కానీ పాఠశాలకు చేరుకోక ముందే దుండగుల చేతిలో అత్యాచారానికి గురైనట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో బాలికపై జరిగిన దురాఘతం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై, అర్థనగ్నంగా నడివీధిలో నడుస్తూ సాయం చేయాలని కోరింది. కానీ అక్కడున్న స్థానికులు ఆమెపై కనికరం కూడా చూపెట్టలేదు. చివరికి ఓ ఆశ్రమ పూజారి ఆమెను రక్షించి హాస్పిటల్ లో చేర్పించారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
కాగా ఈ ఘటనలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయలుదేరిందని, కానీ పాఠశాలకు చేరుకోకముందే ఆమెపై ఈ దారుణం జరిగిందని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సాత్నాకు జిల్లాకు చెందిన ఆయన ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 24వ తేదీన తన కూతురు ఎప్పటిలాగే పాఠశాలకు నడిచి వెళ్లిందని చెప్పారు. బాలిక 8వ తరగతి చదువుతోందని, తమ ఇంటికి కిలోమీటరు దూరంలోనే పాఠశాల ఉంటుందని అన్నారు.
సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో తాను, కుటుంబ సభ్యులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికామని అన్నారు. కానీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో సెప్టెంబర్ 25వ తేదీన పోలీసులను ఆశ్రయించి, మిస్సింగ్ కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా.. బాలిక మేనమామ వైరల్ అయిన వీడియోలో కూతురును గుర్తించి తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్ ఖేరీ వద్ద బాలిక ఆటో ఎక్కింది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి దండి ఆశ్రమం సమీపంలో పడేశారు. దీంతో ఆ బాలిక సాయం కోరుతూ సమీపంలో కాలనీలోకి ప్రవేశించింది. కానీ ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చివరికి ఆశ్రమ పూజారి బాధితురాలికి సాయం చేశాడు. ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు.
ఇదిలా ఉండగా.. బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు ఉండడంతో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సత్నా పోలీస్ సూపరింటెండెంట్ సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక వేర్వేరు ప్రదేశాలలో ఐదుగురిని కలుసుకుంది. దీంతో వారందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు. అయితే వారి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. బాధితురాలికి ప్రత్యేక వైద్యుల బృందం ఆ బాలికకు శస్త్రచికిత్స చేశారు.