ఉజ్జయిని మహాకాళి ఆలయంలో అగ్ని ప్రమాదం: 13 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహకాళి దేవాలయంలో ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళి గర్భగుడిలో సోమవారంనాడు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు.హోళి పర్వదినాన్ని పురస్కరించుకొని భస్మ హరతి ముగిసి, కపూర్ హరతి ప్రారంభం కావాల్సి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గర్భగుడిలో భస్మ హరతి సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందిని ఇండోర్ కు తరలించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్టుగా జిల్లా కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ చెప్పారు.
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో అగ్నిప్రమాద ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమీక్షించారు.ఈ ప్రమాదం విషయమై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తో మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో అమిత్ షా తెలిపారు. అగ్ని ప్రమాదంపై వివరాలను తెలుసుకున్నట్టుగా చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా అమిత్ షా పేర్కొన్నారు.
ఈ ఘటనను దురదృష్టకర ఘటనగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నట్టుగా మోహన్ యాదవ్ చెప్పారు. గాయపడిన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.