ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అంతేకాదు, ప్రధాని మోడీ టార్గెట్‌గా కౌంటర్ ఇస్తూ తన వ్యాఖ్యలు సరైనవేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే కాంగ్రెస్సీలను అందరినీ చంపేయాలని అర్థమా? అని ఎదురుప్రశ్నించారు.
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరో కామెంట్ చేశారు. ఈ సారి ఏకంగా ప్రధాని మోడీనే టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఆయన స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉన్నట్టు స్పష్టం చేశారు. తనపై నమోదైన కేసులకు ఏ చట్టపరమైన చర్యకైనా సిద్ధమే అని అన్నారు.
సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని రేపాయి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు.. నిర్మూలించాలని పిలుపు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్, డీఎంకేలను తీవ్రంగా విమర్శించింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మొత్తం కూడా హిందు వ్యతిరేకి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్‌ను అడగ్గా.. ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగానే చెప్పారు. తాను కేవలం సనాతన ధర్మాన్ని విమర్శించానని చెప్పారు. దాని నిర్మూలన చేయాలని మాత్రమే పిలుపు ఇచ్చానని వివరించారు.
‘ఇదే విషయాన్ని నేను మళ్లీ మళ్లీ అంటాను. కొందరు చిన్నపిల్లల్లా వ్యవహరిస్తూ నేను మొత్తం ఊచకోతకే పిలుపు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొందరు ద్రావిడాన్ని నిర్మూలించాలని పిలుపు ఇస్తున్నారు. అంటే.. డీఎంకే మనుషులను చంపేయాలనా? అదే మరీ, ప్రధాని మోడీ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటే ఏమిటీ? కాంగ్రెస్ మనుషులను అందరినీ చంపేయాలనేనా? సనాతన అంటే ఏమిటీ? దాని అర్థం యథాతథం, అన్ని శాశ్వతం అని చెప్పడమే’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
Also Read: ఉదయనిధి స్టాలిన్ కు ప్రకాష్ రాజ్ బాసట: సోషల్ మీడియాలో పోస్టులు
‘కానీ, ద్రావిడ మోడల్ అలా కాదు. ద్రావిడ్ మాడల్ మార్పునకు పిలుపు ఇస్తుంది. అందరూ సమానంగా ఉండాలని చెబుతుంది. బీజేపీ నా వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నది. అది వాళ్లు ఎప్పుడూ చేసేదే అనుకోండి. వారు నా పై వేసే కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. బీజేపీ ఇండియా కూటమి అంటే భయపడుతున్నది. అందుకే వారు దృష్టి మరల్చే పని చేస్తున్నారు. వాళ్లే ఇవన్నీ అంటున్నారు. డీఎంకే పాలసీ ఏమిటంటే.. ‘ఒకే జాతి, ఒకే దేవుడు’’ అని మంత్రి ఉదయనిధి అన్నారు.
ఉదయనిధి శనివారం చేసిన వ్యాఖ్యలను అమిత్ మాల్వియా షేర్ చేస్తూ.. ఆయన హిందువుల ఊచకోతకు పిలుపు ఇచ్చాడని కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఉదయనిధి వెంటనే రియాక్ట్ అయ్యారు. తాను ఎప్పుడూ ఊచకోతకు పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని పాటించేవారిని చంపేయాలని అనలేదని వివరణ ఇచ్చారు. తాను అట్టడుగు వర్గాల తరఫున మాట్లాడానని, వారు సనాతన ధర్మానికి బలవుతున్నారని తెలిపారు. ‘పేరు, కులాల ఆధారంగా విభజించే సూత్రం సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, మనుషుల్లో సమానత్వాన్ని ఎత్తిపట్టడమే’ అని స్టాలిన్ స్పష్టంగా వివరించారు.
