'సనాతన ధర్మాన్ని నాశనం చేస్తేనే... ' : మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి
సనాతన ధర్మంపై మరోసారి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. గతంలో సనాతన ధర్మం పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సంచలన ప్రకటనలు చేయడం ఆనవాయితీగా మారిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై విషం చిమ్ముతూనే.. సనాతన నిర్మూలనతో అంటరానితనం కూడా అంతం అవుతుందని అన్నారు.
మనుషుల మధ్య ఉన్న అంటరాని తనం అంతం కావాలంటే సనాతన ధర్మం అంతమొందాలన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తే అంటరానితనం కూడా స్వయంచాలకంగా అంతమవుతుందని అన్నారు. సనాతన ధర్మం, అంటరానితనం రెండు కవల పిల్లలని చెప్పారు.
రాష్ట్రంలో సామాజిక వివక్షపై తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యపై ఆయన మంగళవారం స్పందిస్తూ.. ఈ ప్రకటన చేశారు. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో కుల ప్రాతిపదికన సామాజిక వివక్ష ఇప్పటికీ కనిపిస్తోందని గత వారం ఒక సాంస్కృతిక కార్యక్రమంలో గవర్నర్ రవి అన్నారు.
వివాదాస్పద వ్యాఖ్య
ఉదయనిధి స్టాలిన్ కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వ్యాధులతో పోల్చారు. ఆ వ్యాధులను నాశనం చేసినట్లే.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి చెప్పడం గమనార్హం. కొన్ని విషయాలను వ్యతిరేకించలేము. దాన్ని పూర్తిగా నాశనం చేయాలని అన్నారు.
దీన్ని ప్రచారం చేయడం ద్వారా మానవత్వం, సమానత్వం నిలిచిపోతుందని సనాతన ధర్మాన్ని నిందించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. అయినా.. ఆయన వెనక్కు తగ్గకుండా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను సమర్థిస్తూ తాజాగా మరో సారి సనాతన ధర్మంపై మాట్లాడారు. ఉదయనిధిపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ.. దేశంలోని 80 శాతం మంది హిందువులను నాశనం చేశారని డీఎంకే నేతలు మాట్లాడుతున్నారని అన్నారు.