సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి తల నరికిన వారికి రూ.10 కోట్లు ఇస్తానని అయోధ్య తపస్వి చావ్నీకి చెందిన మహంత్ పరమహంస దాస్ అన్నారు. సనాతన ధర్మాన్ని ఎవరూ అంతం చేయలేరని తెలిపారు.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పలు వర్గాల నుంచి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా అయోధ్య తపస్వి చావ్నీకి చెందిన మహంత్ పరమహంస దాస్.. మంత్రిని తీవ్రంగా హెచ్చరించారు. ఉదయనిధి తల నరికిన వారికి రూ.10 కోట్ల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. 'సనాతన ధర్మం' వేల సంవత్సరాలుగా ఉందని తెలిపారు. దానికి అంతం లేదని, ఎప్పటికీ నాశనం కాదని అన్నారు. దానిని నాశనం చేయడానికి ప్రయత్నించకూడదని హెచ్చరించారు.
కాగా.. ఈ హెచ్చరికలపై చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్పందించారు. ఇలాంటి వాటికి తాను భయపడబోనని అన్నారు. తన తల దువ్వుకోవడానికి రూ.10 దువ్వెన చాలని, రూ.10 కోట్లు ఎందుకు అని ప్రశ్నించారు. తమిళ భాష కోసం తన తాత రైలు పట్టాలపై తల పెట్టారని గుర్తు చేశారు.
అయితే పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం తన వ్యాఖ్యలపై మరింత స్పష్టతను ఇచ్చారు. తాను కుల విభేదాలను ఖండిస్తూ మాట్లాడానని, ఒక నిర్దిష్ట మతాన్ని ఉద్దేశించినది కాదని అన్నారు. తన వ్యాఖ్యలపై మరింత వివరణ ఇచ్చారు. ‘‘మొన్న నేను ఓ కార్యక్రమంలో దాని గురించి (సనాతన ధర్మం) మాట్లాడాను. నేనేం చెప్పినో మళ్లీ మళ్లీ అదే చెబుతాను. కేవలం హిందువులే కాదు అన్ని మతాలను చేర్చాను. కుల విభేదాలను ఖండిస్తూ నేను మాట్లాడాను..’’ అని ఆయన అన్నారు. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదని, కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే వాటికి మాత్రమే వ్యతిరేకం అని చెప్పారు.
‘‘ సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వారిని ఊచకోత కోయాలని నేనెప్పుడూ పిలుపునివ్వలేదు. కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే సూత్రం సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని రూపుమాపడం మానవత్వాన్ని, మానవ సమానత్వాన్ని నిలబెట్టడమే’’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
కాగా.. అంతకు ముందు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ప్రతిపక్ష కూటమి బీజేపీ హిందూ మతాన్ని ద్వేషిస్తోందనడానికి ఉదయనుధి స్టాలిన్ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, నితీష్ కుమార్ ఎందుకు మౌనం వహిస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రశ్నించింది.
ఈ విమర్శలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ.. సమాన హక్కులు ఇవ్వని ఏ మతమైనా రోగంతో సమానమని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ పి.కార్తీ చిదంబరం కూడా స్టాలిన్ జూనియర్ ను సమర్థించారు. ‘‘సనాతన ధర్మం కుల శ్రేణి సమాజానికి సంకేతం తప్ప మరేమీ కాదు. దాని కోసం బ్యాటింగ్ చేస్తున్న వారంతా గుడ్ ఓలే డేస్ కోసం ఆరాటపడుతున్నారు! కులమే భారతదేశానికి శాపం’’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
