ఉదయనిధి మారణహోమానికి పిలుపునివ్వలేదు.. నా కుమారుడి వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించింది - సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా తన కుమారుడు మారణహోమానికి పిలుపునివ్వలేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు.

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఆయన తండ్రి, సీఎం ఎంకే స్టాలిన్ సమర్థించుకున్నారు. ఉదయనిధి మారణహోమానికి పిలుపునివ్వలేదని, ఆ ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని సీఎం చెప్పారు. షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష చూపే సనాతన సూత్రాలపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశానని అన్నారు. తన కుమారుడికి ఏ మతాన్ని, మత విశ్వాసాలను కించపరిచే ఉద్దేశం లేదని తెలిపారు. అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా ఆయన వైఖరిని బీజేపీ అనుకూల శక్తులు సహించలేకపోతున్నాయని విమర్శించారు. సనాతన ఆలోచనల కలిగి ఉన్న ప్రజల ఊచకోతకు ఉదయనిధి పిలుపునిచ్చారనే తప్పుడు కథనాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో ఓ సుధీర్ఘ పోస్టు పెట్టారు.
మంత్రిమండలి సమావేశంలో ఉదయనిధి వ్యాఖ్యలకు సరైన సమాధానం అవసరమని ప్రధాని పేర్కొన్నట్టు జాతీయ మీడియా నుంచి రావడం బాధాకరమని తమిళనాడు సీఎం అన్నారు. ‘‘ ఏదైనా క్లెయిమ్ లేదా నివేదికను ధృవీకరించడానికి ప్రధాన మంత్రికి అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. ఉదయనిధి గురించి ప్రచారం అవుతున్న అబద్ధాల గురించి ప్రధానికి తెలియదా లేక తెలిసి అలా చేస్తున్నారా’’ అని ప్రశ్నించారు.
‘‘గౌరవనీయ మంత్రి ఉదయనిధి స్టాలిన్ బీజేపీ వక్రీకరించినట్లు ‘మారణహోమానికి’ పిలుపునివ్వలేదు. వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారు. బాధ్యతాయుతమైన, గౌరవనీయులైన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు వాస్తవాలను విస్మరించారు. వాస్తవాలను ధృవీకరించుకోవడానికి అన్ని సౌకర్యాలు, వనరులు ఉన్నప్పటికీ తప్పుడు కథనాలను ప్రేరేపిస్తున్నారు.’’ అని ఆయన అన్నారు.
చంద్రయాన్-3 ను చంద్రుడిపైకి ప్రయోగిస్తున్న సమయంలోనూ కొందరు కులవివక్షను ప్రచారం చేస్తూనే ఉన్నారని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ‘‘వర్ణాశ్రమ సూత్రాల ఆధారంగా సామాజిక వర్గీకరణకు ప్రాధాన్యమివ్వడం, మతపరమైన వాదనలకు మద్దతుగా శాస్త్రాలు, ఇతర ప్రాచీన గ్రంథాలను ఉదహరించడం... కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారు, మహిళలు పని చేయకూడదని, వితంతు మహిళలు పునర్వివాహం చేసుకోరాదని వాదిస్తున్నారు.’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.