Karnataka: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో  ఓ దుకాణదారుడిని అత్యంత దారుణంగా హ‌త్య చేసిన నేపథ్యంలో క‌ర్నాట‌క బీజేపీ.. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది. 

Udaipur Murder Case: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులు ఒక వ‌ర్గానికి చెందిన దుకాణదారుని తల నరికి చంపారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో వీడియోలో ఇద్దరు నిందితులు హత్యాయుధాలతో కనిపించడంతోపాటు నేరాన్ని అంగీకరించడం సంచ‌ల‌నంగా మారింది. నిందితులు ప్రధాని నరేంద్ర మోడీని కూడా చంపేస్తామని బెదిరించారు. ఇది వైర‌ల్ కావ‌డంతో రాజ‌స్థాన్ లో ఉద్రిక్త‌ల‌కు దారితీసింది. ఉదయపూర్‌లో ఉద్రిక్త‌వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ప‌రిస్థితులు దిగ‌జార‌కుండా ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై భారీగా పోలీసుల‌ను మోహ‌రించింది. ఇంట‌ర్నెట్ ను నిలిపివేశారు. ఇప్పుడు ఉద‌య్‌పూర్ హ‌త్య కేసు రాజ‌కీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. 

క‌ర్నాట‌క బీజేపీ ఒక అడుగుముందుకేసి కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించిందని బిసినెస్ స్టాండ‌ర్డ్ నివేదించింది. “టెర్రరిస్ట్ కాంగ్రెస్” పేరుతో ఆన్‌లైన్ ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింద‌ని పేర్కొంది. బీజేపీ త‌న ఆన్‌లైన్ ప్ర‌చారం పోస్టుల‌లో “భారతదేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో హిందువుల మారణహోమం జరుగుతోంది. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోకి వచ్చినా హిందువులకు భద్రత ఉండదనడానికి రాజస్థాన్ ఘటనే నిదర్శనం' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. హంతకులను ఉరితీయాలని క‌ర్నాట‌క బీజేపీ డిమాండ్ చేస్తూ, టెర్రరిస్ట్ కాంగ్రెస్ అనే హ్యాష్‌ట్యాగ్ తో పోస్టులు చేస్తోంది. 'కాంగ్రెస్‌ ఒక ఉగ్రవాద పార్టీ. ఛాందసవాద అంశాలను బుజ్జగించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. అమానవీయ ఘటన జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంది’’ అని బీజేపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. 

“జీవించే హక్కు గురించి మాట్లాడే వారు ఇప్పుడు ఎక్కడికి పోయారు? అని బీజేపీ ప్రశ్నించింది. జాతీయ చింతన్ శివిర్ నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 'భారత్ జోడో' పిలుపు ఇచ్చిన రాష్ట్రంలో హిందువులకు భద్రత లేదు' అని బీజేపీ పేర్కొంది. “హిందువుల మృతదేహాలపై భారతదేశాన్ని ఏకం చేయాలనుకుంటున్నారా? మతపరమైన ఉద్దేశ్యాలతో జరిగిన హత్యల సంఘటనల పట్ల కాంగ్రెస్ ఎంపిక సానుభూతి విధానాన్ని పాటిస్తుంది. ఏ పార్టీ అయినా మానవ రక్తంలో మతాన్ని వెతకడానికి ప్రయత్నిస్తే అది కాంగ్రెస్సేనని బీజేపీ విమర్శించింది. హిందూ విశ్వాస వ్యవస్థను ప్రశ్నించిన జర్నలిస్టును అరెస్టు చేయడాన్ని అపహాస్యం చేసిన ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, శిరచ్ఛేదం జరిగిన తర్వాత కూడా కళ్లు మూసుకుని ఆ విషయంపై మౌనంగా ఉన్నారు” అని బీజేపీ పేర్కొంది.

“కాంగ్రెస్ చేస్తున్న అతిగా బుజ్జగింపు రాజకీయాల కారణంగా, మతోన్మాదులు కన్హయ్య లాల్‌ను పొట్టన పెట్టుకున్నారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో హిందూ యువకులు పరేష్ మేస్తా, శరత్ మడివాలా, రుద్రేష్ హత్యకు గురయ్యారు’’ అని బీజేపీ పేర్కొంది. కాగా, ఉద‌య్‌పూర్ హ‌త్య నేప‌థ్యంలో రాజ‌స్థాన్ లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. రాష్ట్రంలో నిర‌స‌న‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జార‌కుండా ఉండేందుకు 24 గంట‌ల పాటు ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు. ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్.. ప్ర‌జ‌లు శాంతికి భంగం క‌లిగించ‌కుండా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.